నిలిచిన కంప్యూటర్ బోధన Sakshi | Updated: July 05, 2017 01:48 (IST)
♦ ప్రభుత్వ పాఠశాలల్లో మూలనపడ్డ కంప్యూటర్లు
ఆదిలాబాద్‌టౌన్:
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్యావిధానం ఆటకెక్కింది. ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు ముగియడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి.ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు ముగియడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. దీంతో సర్కార్ బడుల్లో చదివే పేద విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందకుండా పోయింది. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంప్యూటర్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు.
ఐదేళ్లపాటు కంప్యూటర్ విద్యాబోధన చేసేందుకు జిల్లాలో హెడ్‌కామ్ అనే ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో పాఠశాలలకు ఇద్దరు చొప్పన బోధకులను నియమించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంతో పాటు ఫ్యాకల్టీలు ఉపాధి పొందేవారు. వీరందరినీ తొలగించడంతో ఉపాధి కోల్పోగా, విద్యార్థులు పూర్తి స్థాయిలో కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 173 ఉన్నత పాఠశాలలు, 102 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 43 ప్రాథమిక పాఠశాలల్లో, 48 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా విధానం అమలులో ఉంది. వీటిలో పనిచేసే 182 మందిని తొలగించడంతో కంప్యూటర్ పరిజ్ఞా నం ఉన్న ఉపాధ్యాయుల చేత కంప్యూటర్ విద్యావిధానాన్ని కొనసాగించాలని అధికారులు భావించారు. అయితే సరైన శిక్షణ లేకపోవడం, అవగాహన కొరవడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి.
మూడేళ్లయినా పట్టింపేది?
కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి సర్యశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు 10 నుంచి 12 చొప్పన కంప్యూటర్లు అందజేశారు. ప్రింటర్, యూపీఎస్‌లను సైతం సమకూర్చారు. వీటి సాయంతో తెలుగు, గణితం, ఇంగ్లిష్, పరిసరాల విజ్ఞానం పాఠాలు సులభమైన రీతిలో ఆడియో, వీడియో ద్వారా బోధించేవారు. విద్యార్థులకు నెలవారీ పరీక్షలు కూడా నిర్వహించేవారు.
కంప్యూటర్ విద్య అటకెక్కడంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, జనరేటర్లు మూలనపడ్డాయి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు గానీ, ప్రభ్వుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమవుతున్నారు. కంప్యూటర్ బోధకులను నియమిస్తే గానీ కంప్యూటర్ ఆధారిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనిని పునరుద్ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.
బోధకులను తీసుకోవాలి
– హేమంత్, కంప్యూటర్ బోధకుడు
మూడేళ్ల క్రితం కంప్యూటర్ బోధకులను తొలగించారు. కాంట్రాక్టు సంస్థల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్ విద్యా విధానాన్ని నడిపించాలి. మమ్మల్ని తొలగించడం ద్వారా ఉఫాధి కోల్పోయాం. విద్యార్థులకు మెరుగైన కంప్యూటర్ విద్య అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
బోధన కొనసాగించాలి
ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ విద్యను కొనసాగించాలి. విద్యార్థులు కూడా ప్రతిభను పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. చెడిపోయిన కంప్యూటర్‌లను మరమ్మతు చేయించాలి.
– కౌసర్, ప్రధానోపాధ్యాయుడు,ప్రభుత్వ బాలికల పాఠశాల, ఆదిలాబాద్
ఎదరుచూస్తున్నాం
మా పాఠశాలలో రెండు సంవత్సరాలుగా కంప్యూటర్ బోధన నిలిచింది. దీంతో కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోలేక పోతున్నాం. కంప్యూటర్ టీచర్లను నియమించి విద్యను అందించాలి. విద్యార్థులంతా దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
– పరాహా, విద్యార్థిని, ప్రభుత్వ బాలికల పాఠశాల, ఆదిలాబాద్
పరికరాలు అందజేస్తున్నాం
పాఠశాలల్లో చెడిపోయిన కంప్యూటర్ల మరమ్మతు కోసం ప్రభుత్వం విడిభాగాలు సరఫరా చేసింది. చెడిపోయిన పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలకు వాటిని అందజేస్తున్నాం. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గణితం, ఫిజిక్స్ ఉపాధ్యాయులకు ఇదివరకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చాం.
– కె.లింగయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి
No comments:
Post a Comment