Posted on: Fri 21 Feb 04:58:26.379939 2014
- సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వారిదే
-ధర్నాలో ఎమ్మెల్సీ నాగేశ్వర్ అ కదం తొక్కిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
డిమాండ్ల సాధనకోసం ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఒక రోజు సమ్మెకు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుండి ఇందిరాపార్కు వరకు వేలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో నాగేశ్వర్ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ...రాజీనామా చేసింది ముఖ్యమంత్రి, పదవులు ఊడిపోయింది మంత్రులకేనని చెప్పారు. అంతేతప్ప గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాదని తెలిపారు.
అందువల్ల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయింది, అయితే తెలంగాణలోనైనా, సీమాంధ్రలోనైనా కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు తమ సమస్యల పరిష్కారంకోసం పోరాడాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు చేరిన నేపథ్యంలో పలు సవరణలు ప్రతిపాదించిన కెసిఆర్, వెంకయ్యనాయడు, ఇతర నేతలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ ఎందుకు సవరణలు సూచించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది, ఈ సమయంలో ఆందోళనలు అవసరమా? అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, రాజకీయ సంక్షోభమే కాదు, ప్రజల జీవితాలు కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయి, మరి ఈ విషయం గురించి ఎవరూ పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కడుపులు మండుతున్నప్పుడు పోరాటాలు చేయకపోతే మరేం చేయాలి? అని ప్రశ్నించారు. 'రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రాంతంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీరిస్తామంటూ కొందరు ఆశలు, భ్రమలు కల్పించారు, భవిష్యత్తులో వారు తమ హామీలను నిలబెట్టుకోకపోతే మీ తరపున శాసనమండలి సభ్యుడిగా వాళ్లని గల్లా పట్టుకుని నిలేస్తా' అని హామీనిచ్చారు. ఎపి పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ ఎమ్.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సిఎం కాంట్రాక్టు పీరియడ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించకుంటే వచ్చే ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. వివిధ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. గత ఇరవై ఏళ్ల నుండి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరితో చాకిరీ చేయించుకుంటూ పిఆర్సీని అమలు చేయకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిడిసియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి, ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలడుగు భాస్కర్, నాయకులు జె.వెంకటేశ్, గ్రేటర్ హైదరాబాద్ గౌరవాధ్యక్షులు పద్మశ్రీ, అధ్యక్షులు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి విజరు, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ర్నా అనంతరం వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎకె మహంతికి వినతిపత్రం సమర్పించారు.
ఐకెపి, సిఆర్‌డి ఉద్యోగుల ధర్నా
రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అండ్ ఔట్‌సౌర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి ఐఆర్ సౌకర్యం కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఐకెపి, సిఆర్‌డి ప్రధాన కార్యాలయం ఎదుట శు క్రవారం సంబంధిత ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.ధనలక్ష్మీ హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన కాంట్రాక్టు అండ్ ఔట్‌సౌర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో హెచ్‌ఆర్ పాలసీ ఇస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ వేతనాలు, ప్రమోషన్ సౌకర్యం కల్పించలేదు. 106 మంది అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. డ్రైవర్లు, అటెండర్లు వారి సొంత జిల్లాలకు బదిలీ చేయమని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. ఎన్‌పిఎం పరిధిలో పనిచేస్తున్న సిఎ, విఎ, కంప్యూటర్ ఆపరేటర్లకు గత సమ్మెకాలపు ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించింది దుయ్యబట్టారు. ఉద్యోగుల అక్రమ తొలగింపును నిలిపివేసి తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐకెపి మండల అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లకు సిబిఓ, హెచ్‌ఆర్ అమలు చేయకుండా వారితో ప్రభుత్వం గొడ్డు చాకిరీ చేయించుకుంటోందని దుయ్యబట్టారు. పూటకో సర్క్యూలర్ జారీచేస్తూ హెచ్‌ఆర్ పాలసీపై ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం ఐకెపి, సిఆర్‌డి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు ఐకెపి అధ్యక్షురాలు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.పుష్పరాణి, వి.గౌరిలు మాట్లాడుతూ 2012 ఏప్రిల్ 1న ఐకెపి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకుండా తుంగలో తొక్కిందన్నారు.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ప్రభుత్వం తమకు తక్కువ వేతనాలు ఇస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు, హెల్త్‌కార్డులు, బస్‌పాస్ సౌకర్యం, పే ఫిక్సేషన్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. టిపిఎంయులో పనిచేస్తున్న సిబ్బందికి 36 శాతం అదనపు వేతనాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఐకెపి, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగులు గాయత్రి, కె.అనిత, ఎం.ప్రసాద్, కె.శ్యామల, లక్ష్మీ, శ్రీధర్, బీమ్‌రాజ్, అరుణ, మురళీధర్ ఇతర ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment