Posted on: Wed 08 Jan 05:15:43.367069 2014
- పని భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్
- పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో పాటు వందలాది మంది అరెస్టు
- నేతలను రోడ్లపై ఈడ్చుకెళ్లిన పోలీసులు
ప్రజాశక్తి-హైదరాబాద్ ప్రతినిధి
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఐఆర్ చెల్లించాలని, నూతన పిఆర్‌సిని అమలు చేయాలని కోరుతూ మంగళవారం కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ చేపట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్యోగుల ఆందోళనకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కె.నాగేశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, గేయానంద్, బొడ్డు నాగేశ్వర్‌రావు, వై శ్రీనివాస్ రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించి అక్కడి నుంచి చలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీలను, ఉద్యోగులను, నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకుపోయారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అరెస్టు చేసిన నేతలను గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐదున్నర లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎవినాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి భూపాల్, వివిధ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు జనార్దన్‌రెడ్డి, జె వెంకటేశ్, రమ, లక్ష్మయ్య, సురేష్, పద్మశ్రీ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని విమర్శించారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న జివో 3ను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వడం లేదన్నారు. మహిళా ఉద్యోగులు అనేక శాఖల్లో మాతృత్వంపై ఆలోచించాల్సిన దుర్భర పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు తమకు బిడ్డ పుడుతున్నందుకు సంతోషించాలో.. లేక ఉద్యోగం పోతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీసం బస్‌పాస్ కూడా ఇవ్వడం లేదని, మరి ఉద్యోగులు పాదయాత్ర చేస్తూ కార్యాలయాలకు రావాలా? అని ప్రశ్నించారు. నెలలకు నెలల జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టు ఉద్యోగులపై సర్కారు నిర్లక్ష్యంపై అనేక మార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన లాభం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి సమస్యలు వినడం లేదనే, అసెంబ్లీకి వచ్చి తామే సమస్యలను విన్నవించేందుకు వస్తున్నట్లు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులకూ ఐఆర్ ఇస్తామని ప్రకటించి మరుసటి రోజు మాట మార్చిందని విమర్శించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలందరూ శాసన మండలిలో 70 శాతం సమయాన్ని కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కేటాయిస్తున్నామన్నారు. కొన్ని సంస్థలు రెగ్యులర్ చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. టిటిడి సంస్థ ఇదే విధానాన్ని అనుసరించిందన్నారు. ఉద్యోగులంతా ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. గేయానంద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేయించుకుని ఒకేసారి తీసివేస్తే వారి కుటుంబాల పరిస్థితేంటని ప్రశ్నించారు. బొడ్డు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల ద్వారానే కాంట్రాక్టు విధానం మొదలైందన్నారు. వామపక్షాలు తప్ప అన్ని పార్టీలు ఈ విధానానికి మద్దతిస్తున్నా యన్నారు. ప్రస్తుతం శాసనమండలి, శాసనసభలోనూ ప్రజా సమస్యలపై కనీసం చర్చ కూడా జరగడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలనే గెలిపించుకోవాలని కోరారు. వై శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దోపిడీ విధానమైనా కాంట్రాక్టు పద్ధతిని తొలగించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment