prajasakti Posted on: Wed 08 Jan 05:15:43.367069 2014
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఐటిసికి అప్పగించడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు పెద్దఎత్తున మంగళవారం ధర్నా చేపట్టారు. ఐటిసికి కేంద్రాలను
అప్పగిస్తే సహించబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌కు అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆయాలు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో
మధ్యాహ్నం తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించి ముట్టడించారు. పోలీసులు కార్యాలయం లోపలికి కార్యకర్తలను వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. చివరకు పోలీసులు పీడీతో మాట్లాడారు. ఆందోళనకారుల వద్దకు వచ్చిన ప్రాజెక్టు డైరెక్టర్ విద్యావతి మాట్లాడుతూ... కేంద్రాల్లో ఐటిసి ప్రవేశం కల్పించే జిఓను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని, ప్రభుత్వ నిర్ణయం వచ్చేలోగా ఆ కంపెనీ ప్రతినిధులను కేంద్రాలకు రావద్దని తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ షరతుల ప్రకారం భవనాలు దొరకని ప్రాంతాల్లో పాత కేంద్రాలనే కొనసాగిస్తామని తెలిపారు. బాలబడుల రద్దుపై గతంలోనే మంత్రికి తెలిపామన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలమన్నారు. అంగన్‌వాడీల ఉపాధికి ప్రమాదం తీసుకొచ్చే చర్యలను అడ్డుకోవాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈదర అన్నపూర్ణ, యం మనోజ పాల్గొన్నారు.
No comments:
Post a Comment