ఆంధ్రప్రదేశ్‌లో కంప్యూటర్ విద్య అయోమయంలో పడింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే వేలాది కంప్యూటర్ల టీచర్ల భవిష్యత్ ఆధారపడి వుంది. సర్కారీ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో 2008లో ప్రారంభించిన ప్రాజెక్ట్ గత విద్యా సంవత్సరంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ని 13 జిల్లాల్లో 3783 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కార్యక్రమం ఐదేళ్లపాటు కొనసాగింది. సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఇందుకు నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమానికి మొదటి ఐదేళ్లు కేంద్రం తన వంతు నిధులు సమకూర్చింది. ఇక నుంచి కంప్యూటర్ విద్యను కొనసాగించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు ఖర్చు పెట్టాల్సి వుంటుంది. కంప్యూటర్ విద్యను బోధించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోలోని 13 జిల్లాల్లో 7564మంది కంప్యూటర్ టీచర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అయితే, గడువు ముగియడంతో ఇప్పుడు వీరి ఉద్యోగాలు కూడా ఊడిపోయాయి. పాఠశాలల తెరిచి వారం రోజులవుతున్నా తిరిగి వీరిని నియమించలేదు. దీంతో కంప్యూటర్ విద్యను కొనసాగిస్తారా? ఎత్తేస్తారా? అనే అనుమానం కలుగుతోంది.
మూలన పడిన కంప్యూటర్లు...
కొన్ని స్కూల్స్‌లో కంప్యూటర్ పట్ల అవగాహన వున్న రెగ్యులర్ టీచర్లు క్లాసులు తీసుకుంటుండగా, చాలా స్కూళ్లలో కంప్యూటర్లు మూలనపడ్డాయి. దీంతో కంప్యూటర్ పరిజ్ఞానానికి ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు దూరం కావాల్సి వస్తోంది. గతంలో కంప్యూటర్ విద్య బోధించిన ప్రతి స్కూల్‌లోనూ పది పన్నెండు కంప్యూటర్లు, జనరేటర్లు వున్నాయి. బోధించే టీచర్లు లేకపోవడంతో ఇప్పుడు వీటన్నింటినీ మూలన పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లను తిరిగి నియమించి, ఈ ప్రాజెక్ట్ కొనసాగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించాలంటున్నారు విద్యార్థులు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదనే సాకుతో తమను అన్యాయం చేయడం మంచిదికాదంటున్నారు.
No comments:
Post a Comment