Posted on: Tue 24 Jun 04:35:26.844159 2014
- విద్యామంత్రికి టిసిటిఎస్ వినతి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన కంప్యూటర్ టీచర్లను కొనసాగించాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ కంప్యూటర్ టీచర్ల సంఘం (టిసిటిఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి జి జగదీష్‌రెడ్డిని టిసిటిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె సతీష్‌కుమార్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె ఆనంద్‌కుమార్, డి కృష్ణయ్య సోమవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2,300 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందిస్తున్నారని తెలిపారు. 2013 అక్టోబర్‌తో ఈ పథకం ముగిసిందని పేర్కొన్నారు. దీంతో 2,300 పాఠశాలల్లో 4,600 మంది కంప్యూటర్ టీచర్లు రోడ్డున పడ్డారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్ విద్యను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. అదనపు నిధులు కేటాయించి పనిచేసిన టీచర్లను కొనసాగించాలని కోరారు. ఈ పథకం నిలుపుదల చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12 లక్షల మంది పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరమవుతోందని తెలిపారు. ఆర్‌ఎంఎస్‌ఎ ద్వారా రాష్ట్రంలోని 2,300 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను కొనసాగించి, కంప్యూటర్ టీచర్లను కొనసాగించాలని కోరారు.
జూలై నెలాఖరుకల్లా అవకాశం కల్పిస్తాం : విద్యామంత్రి
దీనిపై స్పందించిన విద్యామంత్రి జగదీష్‌రెడ్డి జూలై నెలాఖరుకల్లా మొదట సీనియర్స్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాతే కొత్త వారికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తామన్నారని పేర్కొన్నారు.
No comments:
Post a Comment