MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, July 8, 2013

ప్రభుత్వ విద్యా రక్షణ ఇలాగేనా?

ప్రభుత్వ విద్యా రక్షణ ఇలాగేనా?

నాగటి నారాయణ    Mon, 6 May 2013, IST
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థులు తగినంతమంది లేరనే కారణంతో ప్రభుత్వం ఏటా కొన్ని పాఠశాలలను మూసేస్తున్నది. ఈ సంవత్సరం 1,284 మూతబడతాయని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ ఏప్రిల్‌ 2న ప్రకటించారు. గత విద్యా సంవత్సరంలోనే మూతబడిన 867 పాఠశాలలకు కేటాయించిన రూ.133.75 కోట్ల నిధులను తిరిగి ఆర్‌విఎంకు జమ చేయాలని ఎస్‌పిడి ఉషారాణి ఆదేశాలిచ్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే త్వరలోనే ప్రభుత్వ విద్య పతనావస్థకు చేరుతుంది. మొత్తం విద్యార్థులు 133 లక్షల మందిలో 79 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా 54 లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్లలో ఉన్నారు. ఏటా 3-4 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతూ ప్రైవేట్‌ స్కూళ్లలో పెరిగి పోతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి అనేక సూచనలు చేశాయి. వాటిలో ఒక సూచనను అమలు చేయటానికి విద్యాశాఖ స్పందించింది.
నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌ 12 నుంచే విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోవాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అలాగే చేస్తున్నాయి. కానీ ప్రైవేట్‌ స్కూళ్లు అంతకన్నా ముందే చేర్చుకుంటున్నాయి. ఈ పోటీని తట్టుకోవటానికిగాను ఈసారి జూన్‌ ఒకటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే పని ప్రారంభించాలని ఏప్రిల్‌ 18న డిఎస్‌ఇ ఉత్తర్వులిచ్చారు. ఇలాంటి ప్రయత్నాలను స్వాగతించాల్సిందే. కానీ దీని వలన ఫలితం ఏ మేరకు లభిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ విషయంలో రెండు రకాల పరిమితులున్నాయి. ప్రభుత్వం ఒకడుగు ముందుకేస్తే, ప్రైవేట్‌ స్కూళ్లు పదడుగులు ముందుకేస్తున్నాయి. పెద్ద పెద్ద ప్రైవేట్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ స్కూళ్ళు మే నెలలోనే అడ్మిషన్లు పూర్తి చేస్తున్నాయి. కనుక జూన్‌ ఒకటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించినా ఫలితం దక్కుతుందా? రెండోది ఉపాధ్యాయులు 11 రోజులు ముందే బడికి వస్తారా అనేది. అది ప్రభుత్వ విధిగానా లేక స్వచ్ఛందంగానా అనేది తేలాల్సి ఉంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 దాకా (49 రోజులు) విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ వేసవి సెలవులే. అందువలనే ఎన్‌జిఓలకు ఇస్తున్న ఎరండ్‌ లీవ్‌లు టీచర్లకు ఇవ్వటం లేదు. ఇప్పుడు వేసవి సెలవుల్లో 11 రోజులు పాఠశాల విధులకు హాజరు కావాలంటే అందుకు తగిన ఎరండ్‌ లీవ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డైరెక్టర్‌ ఉత్తర్వుల్లో ఈ మాటలేదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తూనే జూన్‌ ఒకటి నుంచే పాఠశాల విధుల్లో చేరే దానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి. ప్రైవేట్‌ స్కూళ్లను నియంత్రించే శక్తి, చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేనందున ఇలాంటి ఆత్మరక్షణా మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు దాపురిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో జూన్‌ ఒకటి నుంచే అడ్మిషన్లు చేపట్టినంత మాత్రానే పిల్లలు బిలబిలమంటూ చేరతారని, తద్వారా ప్రైవేట్‌ స్కూళ్లలో చేరేవారిని నిరోధించవచ్చనుకోవటం అత్యాశే కాగలదు. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ప్రైవేట్‌ స్కూళ్లలోనే చేర్పించటానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. వాటిలో ప్రీ ప్రైమరీ క్లాసెస్‌, ఇంగ్లీషు మీడియంతో పాటు ఉపాధ్యాయుల పని విధానం, పాఠశాలలో ఎకడమిక్‌ వాతావరణం బాగుండాలనేవి ముఖ్యమైనవి. 2011 జూన్‌ 17న నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలంలోని బాచికపల్లి, పల్లికొండ గ్రామాల్లో యుటియఫ్‌ బృందం చేసిన సర్వేలో తల్లిదండ్రులు కోరింది అవే. 'మా పిల్లల్ని 4వ సంవత్సరం నుంచే బళ్లో చేర్చుకోండి, ఇంగ్లీష్‌ చదువు చెప్పండి, మా ఊరు బళ్ళోనే చేరుస్తాం, పైసల్‌ ఖర్చుబెట్టి ఆటోల్లో ఎక్కించి ఎక్కడో దూరానున్న ప్రైవేట్‌ స్కూల్‌కి తోలేది మానేస్తం' అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లు మండలం రాంనుంతల ఉళ్లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల 2010-11 విద్యా సంవత్సరంలో మూతబడింది. ఆ ఊరి పిల్లలు 8 కిమీ దూరం ఆమనగల్లులోని ప్రైవేట్‌ స్కూళ్ళకు రోజూ ఆటోల్లో పోతున్నారు. ఊళ్లో బడిని వదిలేసి దూరంగా ఉన్న ప్రైవేట్‌ స్కూల్‌కు ఎందుకు పిల్లల్ని పంపుతున్నారని తల్లిదండ్రుల్ని అడిగితే 'సార్లు వస్తలేరు, సదువు జెప్తలేరు' అందుకే బయటికి పంపుతున్నామన్నారు. సార్లు సరిగ్గా వచ్చి రోజూ బడి నడిస్తే మా పిల్లల్ని మా ఊరి బళ్లెకే పంపిస్తామనీ అన్నారు. కనుక ఇతర కారణాలు ఎలా ఉన్నా ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్‌ మీడియంతో పాటు ఉపాధ్యాయులు రెగ్యులర్‌గా బడికొస్తే ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ బిడ్డల్ని చదివించు కోవటానికి తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారు. అవి లేనందునే ప్రైవేట్‌ స్కూళ్లకు పంపుతున్నారు. ఇలాంటి మౌలిక సమస్యల్ని పరిష్కారం చేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నిండుగా ఉండే అవకాశం ఉన్నది. ఈ చర్యలు చేపట్టకుండా జూన్‌ ఒకటి నుంచి ఉపాధ్యాయులను బడికి రావాలని ఆదేశించినా ఒరిగేదేమీ లేదు. కాయకల్ప చికిత్సలతో పతనమవుతున్న ప్రభుత్వ విద్యా రంగాన్ని రక్షించలేరు.
(వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు)
-నాగటి నారాయణ


No comments: