-సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ
-వేతనం పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
Posted on: Sun 02 Mar 04:17:18.4388 2014 ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17వ తేదీ నుంచి అంగన్‌వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు తగు హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ చట్టం ప్రకారం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌లో గ్రాట్యుటీ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అధికారులు చెప్పారు. శనివారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నేతలు చర్చలు జరిపారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహాని, కమిషనర్ చిరంజీవి చౌదరితో చర్చించారు. ప్రస్తుతం హెల్పర్లకు రూ.2200, వర్కర్లకు రూ.4200 చెల్లిస్తున్న వేతనాన్ని ఒక్కొక్కరికీ రూ.800లు పెంచుతున్నట్లు అధికారులు వివరించారు. అద సరిపోదని, కనీస వేతనాల ప్రకారం పెరిగిన ధరలకనుగుణంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ.10 వేలు చెల్లించాలని యూనియన్ నేతలు పట్టుపట్టారు. రూ.800 కంటే ఇంకొంత పెంచుతామని, అది ఎంత అనేది ప్రకటించలేమని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కమిషనర్ చిరంజీవి చౌదరి చెప్పారు. గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అన్నారు. పింఛన్ ఒక్కొక్కరికీ రూ.1000 చెల్లించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంక్రిమెంట్లు ఇప్పటి వరకు హెల్పర్లకు ఇవ్వడం లేదని ఇకపై ఐదేళ్లు సర్వీస్ ఉన్న వర్కర్లకు, హెల్పర్లకు రూ.100, పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రూ.200 ఇంక్రిమెంటుగా ఇస్తామని వివరించారు. సెంటర్ అద్దెలపై ఉన్న షరతులను సడలిస్తామని అన్నారు.
ఇతర సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. యూనిఫారమ్స్ కు కేంద్రం ఒక్కొక్కరికీ రూ.600 ఇస్తోందని, దానిని నగదు రూపంలో ఇవ్వాలని కోరితే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రోజా చెప్పారు. టిఎ, డిఎ బకాయిలను నెలరోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు హామీ ఇచ్చినందున సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం పట్టుదలగా పోరాడిన అంగన్‌వాడీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ పోరాటాన్ని ముందుండి నడిపిన సిఐటియు కమిటీలకు, కార్యకర్తలకు, సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలకు, సిపిఎం నాయకులకు, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. చర్చలకు వెళ్లిన వారిలో సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్ భారతి, ప్రధాన కార్యదర్శి పి రోజా, నాయకులు జయలక్ష్మి, సులోచన, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయిబాబు, కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, జె వెంకటేష్ తదితరులున్నారు. అంగన్‌వాడీల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తి తీవ్రమైన ఉద్యమానికి దారితీసిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రి పట్టించుకోకపోయినా అధికారులు పట్టించుకొని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. సమ్మెకు అనేక ఆటంకాలు కలిగించినా అంగన్‌వాడీలు సమరశీ లంగా పోరాడారని పేర్కొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమం తర్వాతే అధికారుల్లో చలనం వచ్చిందని, సమస్యలు పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
No comments:
Post a Comment