ప్రజాశక్తి - కరీనంనగర్ టౌన్/మెదక్
'ఉపాధి' చట్టం కింద కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజుకూలీ రూ.250 చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.ప్రసాద్ డిమాండ్ చేశారు. వ్యకాస, మేట్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ కోర్టు చౌరస్తాలో శుక్రవారం జీపు జాతాను ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనానికి కొంత భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పేదలంతా పోరాడి సాధించుకున్న ఈ పథకాన్ని ప్రభుత్వం గ్రామీణ పెత్తందార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో చట్టాన్ని కాపాడుకోవడంతో పాటు పకడ్బందీగా అమలు చేయించుకోవాల్సిన బాధ్యతా తమపైనే ఉందన్న అవగాహన కూలీలకు కల్పిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈ ప్రచార జాతా చేపడుతున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. మొదటి రోజు కరీంనగర్ మండలంలోని 9 గ్రామాల్లో జీపుజాతా సాగింది. పని సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాతంగి శంకర్, భూతం సారంగపాణి, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమాసాహెబ్, నాయకులు తిరుపతి పాల్గొన్నారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేపి నివాళులు అర్పించారు.
మెదక్ జిల్లాలో ఐదురోజులుగా కొనసాగుతున్న 'ఉపాధికూలీ గర్జన' యాత్ర శుక్రవారం సంగారెడ్డి మండలంలోని చిద్రుప్ప, ఉత్తరపల్లి, బేగంటపేట్, బేగంపేట్ తండా తదితర గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా సంఘం మండల కార్యదర్శి పి.అశోక్ మాట్లాడుతూ.. ఉపాధి కూలి రూ.250కి పెంచాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని, 200రోజులు పనిదినాలు కల్పించాలని కోరారు. యాత్రలో నాయకులు ఎన్.భాస్కర్, నర్సింలు, లావణ్య, ప్రభుకర్, గోపాల్, నవనీత, జ్యోతి, బాలయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
No comments:
Post a Comment