Sakshi | Updated: January 14, 2014 02:38 (IST)
నవాబుపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడానికి సన్నాహాలు చేసింది. లక్షల విలువ చేసే కంప్యూటర్లను కొనుగోలు చే సి పాఠశాలలకు పంపింది. కానీ వాటి నిర్వహణ బాధ్యతలను పక్కన పెట్టడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఆరేళ్ల క్రితం ఏర్పాటైన కంప్యూటర్లకు సరైన శిక్షకులు లేక విలువైన కంప్యూటర్లు మూలన పడ్డాయి.
కొన్ని పాఠశాలలకే పంపిణీ...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం మొదటి దశలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి కంప్యూటర్లను అందించింది. మిగిలిన పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించాలని ఆయా మండలాల ఎంఈవోలు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. మండలంలో 11 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. నారెగూడ, అక్నాపూర్, మీనపల్లికలాన్, అక్నాపూర్ పాఠశాలలకు కంప్యూటర్లు ఇప్పటికీ ఇవ్వలేదు. మిగిలిన వాటిలో ఒక్కో పాఠశాలకు 11 చొప్పున ఇచ్చారు.
ఉన్నచోట నిరుపయోగంగా...
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీంతో వారు ఇన్‌స్ట్రక్టర్లను నియమించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఏడాది పాటు బాగానే సాగినా నిర్వహణ సంస్థలు ఇన్‌స్ట్రక్టర్లకు గౌరవ వేతనాలు అందించకపోవడంతో వారు పాఠశాలలకు రావడం మానేశారు. దీంతో కంప్యూటర్లు నిరుపయోగంగా మారి పాడవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అన్ని పాఠశాలలకు కంప్యూటర్లు అందించాలని, విద్యార్థులకు కంప్యూటర్ విద్యను సరిగా అందించాలని పలువురు కోరుతున్నారు.
No comments:
Post a Comment