Posted on: Wed 18 Dec 00:04:41.758765 2013
జీవితాన్ని సమగ్రంగా దర్శింపజేసే సాధనాలు పుస్త కాలని ఒక మహాను భావుడు చెప్పియున్నారు. అయితే మన సమాజంలో రాను రాను పుస్తక పఠనా భిరుచి తగ్గుతూ ఉండటం ఆందోళన కల్గించే అంశం. దేశ వ్యాప్తంగా దృశ్య మాధ్యమ ప్రభావం పెరగడం వల్ల దిన, వార, మాస పత్రికలకు ఆదరణ తగ్గుతోంది. ఈ ధోరణిని నిలువరించడానికి ప్రభుత్వం, గ్రంథాలయ సంస్థలు అడపాదడపా పుస్తక వారోత్సవాలు, గ్రంథాలయ వారోత్సవాలు వంటివి నిర్వహిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పత్రికా పఠనం అలవాటు చేయాలి. వారికి పిల్లల మాస పత్రికలు, విజ్ఞానదాయక పుస్తకాలు, జీవిత చరిత్రలు వంటి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలి. తీరిక సమయాల్లో బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేయడం నేర్పించాలి. దినపత్రికల్లో బాలల పేజీని చదివిస్తూ పజిల్స్ పూరింపజేస్తూ ఆ పేజీలను సేకరించి అన్నింటినీ ఒక సంపుటిగా బైండింగ్‌గా చేయించవచ్చు. ఇట్లాంటి సంపుటాలను పిల్లల పుట్టినరోజు బహుమతిగా ఇస్తే వారెంతో సంతోషిస్తారు. కనుక పిల్లలను టీవీకి దూరంగా ఉంచి వారి స్థాయిలో పుస్తక పఠనం అభ్యాసం చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. పత్రికలను అందుబాటులో ఉంచితే పిల్లలకు కొంత కాలానికైనా వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఇది సహజం. దీని కోసం తల్లిదండ్రులు పెద్దగా కష్టపడనక్కర లేదు. అయితే ప్రతి ఇంట్లో ఉన్న మీడియా ప్రభావానికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే సెల్‌ఫోన్ కూడా పిల్లల విలువైన సమయాన్ని హరించివేస్తోంది. అవసరం లేనప్పుడు పిల్లలు మొబైల్ ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నప్పుడు అలవడకపోతే పుస్తక పఠనం పెద్దయ్యాక అలవడదు. కనుక విద్యార్థి దశలోనే వారితో మంచి పుస్తకాలు చదివించాలి. పుస్తక పఠనం వల్ల పిల్లల్లో దేశభక్తి, ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, సృజనాత్మకత వంటి సామర్థ్యాలు అలవడతాయి. మానసిక వికాసం కలుగుతుంది. కనుక పఠనాసక్తిని పెంచడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బుక్ ఫెస్టివల్స్‌లో తక్కువ ధరలకే అపురూప పుస్తకాలను విక్రయించాలి. ప్రభుత్వం గ్రంథాలయాలను పట్టించుకొని అన్ని దిన, వార, మాస పత్రికలను అందుబాటులో ఉంచాలి. బాల సాహిత్యం, కథల పుస్తకాలు, నవలలు, విజ్ఞాన సర్వస్వం, పరిశోధనా గ్రంథాలు, క్రీడా పరిజ్ఞానం, తదితర పుస్తకాలు చదివించే ఏర్పాట్లు చేయాలి. 'పుస్తకం మంచి నేస్తం' అన్న భావనను విద్యావంతులందరిలో వ్యాపింపజేయాలి.
జి అశోక్, గోదూర్, కరీంనగర్‌జిల్లా
No comments:
Post a Comment