Posted on: Sun 15 Dec 02:31:17.360064 2013
ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చాలా వరకు ప్రైవేటు స్కూళ్లల్లోనే ఇంగ్లీషు మీడియం చదువులనే చదివిస్తున్నారు. తాము కష్టపడైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న ఉద్దేశంతో అధిక డబ్బు వెచ్చించి మరీ చదివిస్తున్నారు. చాలా పేద స్థితిలో ఉన్నవారు మాత్రమే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. అసలు ప్రభుత్వ పాఠశాల అనగానే ప్రజల్లో ఒక చిన్నచూపు ఏర్పడింది. అందుకు ముఖ్య కారణాలు పాఠశాల భవనాలు సరిగ్గా ఉండకపోవడం, కొన్ని ప్రాంతాల్లో భవనాలు పాతబడి పోవటం వల్ల పాఠశాల ఆవరణలో చెట్ల కిందే బోధన జరపవలసి వస్తున్నది. అలాగే పాఠశాల పరిసర ప్రాంత వాతావరణం సరిగ్గా ఉండకపోవడం, ఊరికి దూరంగా ఉండటం, పాఠశాల గదుల్లో పిల్లలు కూర్చోవడానికి బెంచీలు లేకపోవటం వల్లనే అమ్మో ప్రభుత్వ పాఠశాల అనే పరిస్థితికొచ్చారు జనాలు. ఇక టారులెట్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కో పాఠశాలలో అసలుండవు. ఒకవేళ ఉన్నాగానీ అవి అసలు బాగుండవు. అలాగే మంచినీటి సౌకర్యం లేకపోవడం కూడా ప్రధాన కారణం. చదువే కాకుండా ఆటల్లో రాణించాలన్న విద్యార్థుల ఆశలు అడియా శలవుతున్నాయి. ఆడుకునేందుకు ఆటస్థలాలున్నాగానీ స్పోర్ట్స్ సామాగ్రి ఉండకపోవటం వల్ల క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని విద్యార్థులు అణచుకోవలసి వస్తోంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు క్లాసులకు లేటుగా రావటం, బోధన అంతంత మాత్రంగానే ఉండటం, పరీక్షల నిర్వహణలో లోపాలు వంటివి ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధాన సమస్యలు. ఇలా ఉన్నందు వల్లే విద్యార్థుల 'డ్రాప్ - అవుట్స్' శాతం పెరుగుతోందనేది వాస్తవం.
డి చాంద్ బాషా
No comments:
Post a Comment