Posted on: Wed 18 Dec 02:14:33.350222 2013
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
పిడిఎఫ్ ఎమ్మెల్సీల డిమాండ్
పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించేందుకు ప్రత్యేక శిక్షకుల్ని నియమించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈనెల 16వ తేదీ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వేసిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చినట్లు ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసులు రెడ్డి, బి నాగేశ్వరరావు తెలిపారు. పాఠశాల విద్యపట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని ఆ సమాధానం తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ గడువు సెప్టెంబర్ 2013తో పూర్తయినందున ఇప్పటి వరకు ఉన్న శిక్షకుల్ని తొలగించి ఆ బాధ్యతల్ని ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నట్లు విద్యాశాఖ నిర్లక్ష్య సమాధానాన్ని చెప్పినట్లు వారు తెలిపారు. దీనికోసం ఉపాధ్యాయులు తగిన శిక్షణ కూడా పొందారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సబ్జెక్ట్ ఉపాధ్యాయులు అదనంగా ఈ బాధ్యతల్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ విద్యకు ఏడాదికి రూ.25 కోట్లు ఖర్చు చేస్తోందని, దీనికి అదనంగా మరో రూ.5 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక శిక్షకుల్ని నియమించమని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తే ఆయన సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పంపమని చెప్పారన్నారు. ఈ హామీని విస్మరించి టీచర్లతో కంప్యూటర్ విద్యను బోధింపచేస్తామనడం ఆచరణ సాధ్యమయ్యేదికాదని వారు అభిప్రాయ పడ్డారు. రెండు నెలలుగా 60 వేల కంప్యూటర్లు బూజుపట్టి మూలపడ్డాయని, విద్యాశాఖ ఇప్పటికైనా తన ధోరణిని మార్చుకోవాలని హితవుపలికారు.
No comments:
Post a Comment