రూ.10 వేలను కనీసవేతనంగా నిర్ణయించాలి
ప్రజాశక్తి - గుంటూరు Fri, 7 Jun 2013, IST
17 నుంచి 19 వరకూ రాయబారం, 20న ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు
కనీసవేతనం రూ.10 వేలకు తక్కువ గాకుండా నిర్ణయించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈమని అప్పారావు, సిహెచ్ నాగబ్రహ్మచారి, వై నేతాజీ, కాపు శ్రీనివాస్‌లు పాల్గొని నోట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన గుంటూరు కార్మిక శాఖ కార్యాలయం వద్ద సామూహిక రాయభారం, 18వ తేదీన గుంటూరు ఇపిఎఫ్ కార్యాలయం వద్ద సామూహిక రాయభారం, 19వ తేదీన గుంటూరు ఇఎస్‌ఐ కార్యాలయం వద్ద సామూహిక రాయభారం, 20వ తేదీన అన్ని తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని అన్నారు. పర్మినెంటు కార్మికులతో సమానంగా పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలని, సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ శాఖలలోని ఖాళీ పోస్టులలో ప్రస్తుతం పని చేస్తున్న వారితోనే భర్తీ చేయాలన్నారు. సెక్యూరిటీగార్డులకు జీవో నం.251 ప్రకారం రూ.10092 నుంచి రూ.6592 వివిధ క్యాడర్లకు రావాలని, ఇవి ఎక్కడ అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరు మండలంలో అంబేద్కర్ ఇసుక ముఠా కార్మిక సంఘం రిజిస్ట్రేషన్‌కు ఇచ్చి 12 నెలలు దాటినా వెరిఫికేషన్ పూర్తికాలేదని విమర్శించారు. అలాగే దుగ్గిరాల ఇసుక ముఠా కార్మిక సంఘం కూడా తొమ్మిది నెలలు దాటినా రిజిస్ట్రేషన్ కాలేదన్నారు. అసంఘటిత రంగం కార్మికులు యూనియన్ పెట్టుకోవడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయమని, ఇందుకు కార్మిక శాఖ అధికారులు సహకారం లేదని అన్నారు. తెనాలి ఎసిఎల్ కార్యాలయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పారు. డిసిఎల్ వారికి విన్నవించినా ఫలితంలేదన్నారు. పౌర సమాచారం ప్రకారం 45 రోజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఆలస్యానికి కారణమైన కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన కార్మిక శాఖ కార్యాలయం వద్ద సామూహిక రాయభారంలో కార్మికులందరూ పాల్గొనాల్సిందిగా కోరారు.
ఎన్‌హెచ్-5కు ఇరువైపులా బోయపాలెం వద్ద స్పిన్నింగ్, పొగాకు, జిన్నింగ్, పెప్సీ, ఐజెఎం తదితర పరిశ్రమలు ఉన్నాయని, వీటిల్లో 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వీరికి ఇఎస్‌ఐ సౌకర్యంలేదని, విద్యుత్, మున్సిపల్, గ్రామ పంచాయతీ శాఖల్లోని కార్మికులకు ఇఎస్‌ఐ అమలు కావడంలేదని చెప్పారు. ఎన్‌హెచ్-5పై యడ్లపాడు నుంచి చౌడవరం వరకూ ఉన్న ప్రాంతాన్ని ఇఎస్‌ఐ కవరేజి కిందకు తీసుకురావాలని, బోయపాలెం వద్ద ఇఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, ఈ లోపు కాలూరి మెడికల్ కాలేజీకి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం ఈ నెల 19వ తేదీన ఇఎస్‌ఐ కార్యాలయం వద్దకు సామూహిక రాయభారంలో కార్మికులు పాల్గొనాల్సిందిగా కోరారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు ఇఎస్‌ఐ అమలు చేయడంలేదని, విద్యుత్, మున్సిపల్ తదితర సంస్థల్లో పిఎఫ్ పేరుతో ఎనిమిదేళ్లుగా జీతాల నుంచి మినహాయిస్తున్నా నేటికి పిఎఫ్ స్లిప్‌లు ఇవ్వలేదని అన్నారు. చనిపోయిన కార్మికులకు పెన్షన్ రావడంలేదని, విద్యుత్ సంస్థలో పిఎఫ్ సొమ్ము 2005-06 సంవత్సరం డబ్బులు ఏమయినవో తెలియడంలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 18న పిఎఫ్ కార్యాలయం వద్ద సామూహిక రాయభారంలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
No comments:
Post a Comment