- నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు - ఏటా విద్యాశాఖ నిర్లక్ష్యం -విద్యా సంవత్సరం కోల్పోతున్న విద్యార్థులు
- అభ్యర్థుల గోడు పట్టని అధికారులు
డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డైట్ సెట్)-2014 నోటిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. డైట్‌సెట్‌ను ఇకనుంచి డిప్లోమ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్)గా పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. డీసెట్‌ను ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తామని ప్రకటించింది. అయినా ఫలితం శూన్యం. ఏప్రిల్ చివరి వారం వచ్చినా డైట్‌సెట్ నోటిఫికేషన్ జారీ కాలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఏటా విద్యాశాఖ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగుతోంది. నిర్లక్ష్యం చేయడం విద్యాశాఖకు అలవాటుగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థులు ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారు. విద్యార్థుల గోడును విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డైట్‌సెట్ నోటిఫికేషన్ ఎందుకు ఆలస్యంగా వస్తుందంటే ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, మంత్రి వద్దే దస్త్రం ఉందని గతేడాది వరకు అధికారులు కారణాలు చెప్పేవారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన నడుస్తోంది. అధికారుల నిర్ణయాలే అంతిమంగా ఉంటాయి. అయినా ఈ ఏడాది కూడా జాప్యం కొనసాగడం షరామామూలుగానే జరగడం విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. డైట్‌సెట్ ఎప్పుడు సెట్ అవుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు డైట్‌సెట్ కోచింగ్‌లకు వెళ్తున్నారు. పట్టుదలతో చదువుతున్నారు. అధికారులు కనికరించి నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆశిద్దాం.
ఏప్రిల్ 9న గతేడాది ఫలితాల విడుదల
డైట్‌సెట్-2013 నోటిఫికేషన్ ఏప్రిల్ 9వ తేదీన విడుదలైంది. రాతపరీక్ష మే 31న జరిగింది. డైట్‌సెట్-2012 నోటిఫికేషన్ ఏప్రిల్ 19న జారీ అయ్యింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ వచ్చినా డైట్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డైట్‌సెట్-2013 ఫలితాలను జూన్ 18న ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5,06,278 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 4,60,856 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. డైట్‌సెట్-2013లో 53.63 శాతం (2,71,533) మంది ఉత్తీర్ణులయ్యారు. 'డైట్‌సెట్ కౌన్సెలింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ 2013, అక్టోబర్ 11 నుంచి 14 వరకు, రెండో విడత కౌన్సెలింగ్ నవంబర్ 16 నుంచి 19 వరకు జరిగింది. తుది విడత కౌన్సెలింగ్ నవంబర్ 27 నుంచి 29 వరకు నిర్వహించారు. మైనార్టీ విద్యార్థుల కోసం 2014, జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 667 ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కాలేజీల్లో 36,320 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 29,900 సీట్లుండగా, మేనేజ్‌మెంట్ కోటాలో 6,420 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 25 ప్రభుత్వ కాలేజీల్లో 3,100 సీట్లు, 642 ప్రైవేట్ కాలేజీల్లో 26,820 సీట్లున్నాయి. ఏప్రిల్ నెలాఖరు వచ్చినా డైట్‌సెట్ నోటిఫికేషన్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పిజి సెట్, లా సెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈనెల 22న ఎంసెట్ రాతపరీక్ష కూడా నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయినా పాఠశాల విద్యాశాఖలో డైట్‌సెట్ నోటిఫికేషన్ విడుదల గురించి కదలిక లేకపోవడం గమనార్హం.
విద్యాసంవత్సరం కోల్పోతున్న విద్యార్థులు
నోటిఫికేషన్ జారీలో జాప్యం, ఫలితాల విడుదలలో నిర్లక్ష్యం, కౌన్సెలింగ్ నిర్వహణలో మరింత జాప్యం చేపట్టడం వల్ల విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారు. జనవరి నెలాఖరు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తే విద్యాసంవత్సరాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో అధికారులే ఆలోచించాలి. గతేడాది జనవరి నెలాఖరు వరకు కౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన గడువు పూర్తయిపోతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోతున్నారు. ఇప్పటికైనా డైట్‌సెట్ నోటిఫికేషన్ వచ్చేనా?అని ఎదురుచూస్తున్నారు. డైట్‌సెట్ నోటిఫికేషన్ రాకపోవడంతో ఎందులో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. టీచర్ కావాలన్న కోరిక ఒకవైపు, విద్యాసంవత్సరం కోల్పోతామన్న మానసిక క్షోభ మరోవైపుతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డైట్‌సెట్ కౌన్సెలింగ్ చేపట్టకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోంది.
No comments:
Post a Comment