- 7 నుంచి జరిగే పరీక్షలన్నీ 11 గంటలకు ప్రారంభం - ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయపాలనలో మళ్లీ మార్పు జరిగింది. ఈనెల 7 నుంచి 17వ తేదీ వరకు జరిగే పరీక్షలన్నీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించబడతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బి మన్మథరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల పోలింగ్ వల్ల టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో గతంలోనే స్వల్ప మార్పు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 7న, 12వ తేదీల్లో జరిగే సామాన్యశాస్త్రం పేపర్-1, పేపర్-2 పరీక్షల నిర్వహణ సమయంలో స్వల్ప మార్పు జరిగిందని ఆయన తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరపడానికి బదులుగా, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అభ్యర్థుల సౌకర్యార్ధం, గందరగోళం తొలగించాలని సమయపాలనలో మళ్లీ మార్పు చేశామని తెలిపారు. ఈనెల 7 నుంచి 17 తేదీ వరకు జరిగే పరీక్షలన్నీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. అయితే ఈనెల 3న, 4వ తేదీల్లో జరిగే గణితం పేపర్-1, పేపర్-2లు యథావిధిగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షల సమయపాలనలో వచ్చిన మార్పులను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు గమనించాలని కోరారు.
No comments:
Post a Comment