బ్రెజిలియా,బ్రెజిల్: అమెరికా ఆన్‌లైన్ గూఢచర్యాన్ని స్నోడెన్ బహిర్గతం చేసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌పై అమెరికా ఆధిపత్యం అంతం అవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అమెరికా ఇంటర్‌నెట్ గూఢచర్యానికి గురైన బ్రెజిల్ ఇంటర్‌నెట్ పాలనకు సంబంధించి ఇంటర్‌నెట్ ప్రయోజకులకు వర్తించే నియమాలనూ, వారి హక్కులనూ, వారికున్న రక్షణలనూ పొందుపరుస్తూ చట్టం చేసి చరిత్ర సృష్టించింది. 25వ తారీఖు రాత్రి 'మార్కో సివిల్ డా ఇంటర్‌నెట్' బిల్లును బ్రెజిల్ చట్ట సభ 'బ్రెజిల్ చాంబర్ ఆప్ డెప్యుటీస్' పెద్ద మెజారిటీతో ఆమోదించింది. ఈ చట్టంలో నెట్ తాటస్థ్యం, ఆంతరంగిక విషయ పరిరక్షణ, ఆన్‌లైన్‌లో భావ స్వేచ్చా ప్రకటన మొదలయిన విషయాలు ఉన్నాయి. ఈ బిల్లును ప్రెసిడెంట్ దిల్మా రౌస్సెఫ్ ఆమోదించటానికి ముందు సెనేట్ ఆమోదించాలి. సెనేట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ గత మూడు సంవత్సరాలలో అనేక సార్లు వాయిదా పడింది. అయితే ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా గూఢచర్యాన్ని బహిర్గతం చేసిన తరువాత ఈ విషయానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చింది. ఇంటర్‌నెట్ తాటస్థ్యం గురించి బిల్లులో పొందుపరిచిన ప్రకరణాలు పౌరసమాజం సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చు. కొన్ని దేశాలలో తమ వ్యాపారానుకూలత కోసం టెలిఫోను కంపెనీలు కొన్ని ఇంటర్‌నెట్ సర్వీసులనే ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నాయి. అయితే మార్కో సివిల్ చట్టం దీనిని ఆమోదించదు.
ఈ బిల్లును త్వరిత గతిన ఆమోదింపజేయటం కోసం స్థానికంగా స్టోరేజ్ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం పక్కనబెట్టింది. ఈ నిబంధన ఇంటర్‌నెట్ ప్రయోజకుల ప్రయివసీని కాపాడటానికి ఉద్దేశించి పెట్టారు. ప్రెసిడెంట్ దిల్మా తన సహాయకులతో చేసిన సంభాషణలను అమెరికా గూఢచర్యం ద్వారా రికార్డు చేసిన విషయం ఇక్కడ గమనార్హం. అయితే ఈ ఆవశ్యకతను తొలగించిన తరువాత బిల్లులోని మరో ప్రకరణాన్ని బలోపేతం చేయవలసి ఉంటుందని ఈ ప్రోజెక్టుకు రాపోర్టర్‌గా ఉన్న అలెస్సాన్‌డ్రో మోలోన్ అన్నాడు. బ్రెజిలియన్లకు అవసరమయిన స్టోరేజీని నిర్వహించే కంపెనీ బ్రెజిల్ చట్టాలకులోబడి పనిచేయాలనేదే ఆ ప్రకరణం. సెనేట్ ఈ బిల్లులో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉన్నది. అయితే వచ్చే నెలలో బ్రెజిల్‌లో జరగనున్న ఇంటర్‌నెట్ పరిపాలనకు సంబంధించిన ప్రపంచ స్థాయి సమావేశం లోగా మార్కో సివిల్ చట్టం అవుతుందనే ఆశాభావంతో దాని మద్దతుదారులున్నారు.
No comments:
Post a Comment