నల్ల బ్యాడ్జీలతో అంగన్‌వాడీల ర్యాలీలు -రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం ప్రజాశక్తి-యంత్రాంగం
తమ సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ వెళుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం, నిర్బంధించడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మంగళవారం మండల కేంద్రాల్లో నల్లచీరలు కట్టుకుని, నల్లబ్యాడ్జీలు పెట్టుకొని, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని చెవిలో పువ్వులతో రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లో సోమవారం రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ హెల్పర్ మృతి చెందడంతో మంగళవారం మృతదేహంలో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. గజపతినగరంలో ఎంపి బొత్స ఝాన్సీలకిëకి వినతిపత్రం అందజేశారు. కృష్ణా పిడీ కార్యాలయం ఎదుట బైఠాయించి, పిడీని నిర్బంధించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ర్యాలీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. విజయనగరంలో ర్యాలీ, అనంతరం మానవహారం చేపట్టారు. విశాఖ జిల్లా చింతపల్లి, పాడేరులో చెవిలో పువ్వులు పెట్టుకొని ర్యాలీ చేశారు. కృష్ణా జిల్లా కేంద్రంలో పీడీ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన ఆంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్ పీడీ కార్యాలయం ముందు బైఠాయించి కార్యకలాపాలను స్థంబింపజేశారు. పీడీని కార్యాలయంలోనే నిర్భందించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంగన్‌వాడీల ఉద్యమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్.బాబూరావు మద్దతు తెలిపారు. నూజివీడులో చిన్నగాంధీ బొమ్మ సెంటర్‌లో ధర్నా, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సిడిపిఒ కార్యాలయాన్ని ముట్టడించారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ నుండి కాళోజీ సెంటర్ వరకు అంగన్‌వాడీలు నల్ల చీరలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు వినరుభాస్కర్, భిక్షపతి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సమ్మయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కొణిజర్లలో ప్రదర్శనలు జరిగాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిలోని హనుమాన్‌పేట చౌరస్తాలో రాస్తారోకో చేశారు. పెన్‌పహాడ్‌లో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో మంత్రి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇబ్రహీంపట్నంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నోటికి నల్లరిబ్బన్లు, కాగజ్‌నగర్‌లో నల్లచీరలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లోని 46 మండలాల్లో అంగన్‌వాడీలు ఆందోళనలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు జరిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు నల్లచీరలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మకు, మంత్రి సునీతారెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. హైదరాబాద్‌లో పలుచోట్ల తమ నిరసన తెలిపారు. బేవరేజస్ (సిఐటియు) యూనియన్ ఆధ్వర్యంలో మద్దతుగా గోల్కొండ క్రాస్ రోడ్డులో దిష్టిబొమ్మ దహనం చేశారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నెల్లూరులో సుందరయ్య విగ్రహం వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో, చిత్తూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కడప జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
No comments:
Post a Comment