PTI | Updated: February 26, 2014 12:04 (IST)
: కంప్యూటర్ లో గానీ, ఇంటర్ నెట్ ద్వారా గానీ వైరస్ ఏమైనా వస్తే.. మీ యాంటీ వైరస్ దాన్ని సమర్ధంగా అడ్డుకోగలదేమో. కానీ వై-ఫై ద్వారా వస్తున్న సరికొత్త వైరస్ ను మాత్రం ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారట. గాలి ద్వారా.. వై-ఫై సిగ్నళ్లతో వస్తున్న ఈ వైరస్ ను అడ్డుకోవడం ఎలాగో తెలియక నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాలు, కాఫీ షాపులలో ఉచితంగా లభించే ఓపెన్ యాక్సెస్ వై-ఫై ద్వారానే ఈ వైరస్ వస్తోందని గమనించారు. సాధారణంగా ఇళ్లలో గానీ, కార్యాలయాల్లో గానీ ఉండే వై-ఫై అయితే సెక్యూరిటీ పాస్ వర్డ్ తో ఉంటుంది. ఆ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప వై-ఫై సిగ్నల్ అందదు.
కానీ, కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొన్ని పెద్దపెద్ద మాల్స్ లోను, కాఫీ షాపుల్లోను, చివరకు పెద్దస్థాయి సినిమా థియేటర్లలో కూడా ఉచితంగా వై-ఫై సదుపాయం కల్పిస్తున్నారు. సింగపూర్ లాంటి చోట్ల అయితే ఏకంగా నగరం మొత్తానికి ఉచితంగా వై-ఫై సిగ్నళ్లు అందుతున్నాయి. ఇలాంటి చోట్లే ప్రధానంగా ఈ సరికొత్త వైరస్ వస్తోందని బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ పరిశోధకులు చెబుతున్నారు. 'కెమిలియన్' అనే ఓ వైరస్ ను వాళ్లు సృష్టించి, నమూనా కోసం ప్రయోగించారు కూడా. ఎన్ క్రిప్షన్ గానీ, పాస్ వర్డ్ లు గానీ లేని వై-ఫైలను అది సులభంగా పసిగట్టి, లోనికి ప్రవేశించింది. కంప్యూటర్ హ్యాకర్లు ఎక్కువగా వై-ఫై కనెక్షన్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, అందువల్ల తప్పనిసరిగా పాస్ వర్డ్ పెట్టుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment