ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడకు ఫోన్ చేసినా కాల్ చార్జి మాత్రమే పడేది. కానీ ఇక నుండి రాష్ట్రంలో రోమింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. కనుక ఇక మీదట మీ మాటలను కొంచెం పొదుపుగా వాడండి. లేకపోతే ఇక నుండి మోగేది సెల్లు కాదు.. మీ మొబైల్ బిల్లు.
మొబైల్ కంపెనీలకు పండగే...
సాధారణంగా ఒకే రాష్ట్ర పరిధిలో ఉన్నంత వరకూ ఫోన్ కాల్స్ కు కాల్ ఛార్జి మాత్రమే పడుతుంది. కానీ, పరిధి దాటి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కాల్ ఛార్జితో పాటు.. అదనంగా రూపాయి నుండి మూడు రూపాయల వరకూ ఛార్జి వసూలు చేస్తారు. ఈ అదనపు భారాన్నే రోమింగ్ అంటారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రజల నుండి రోమింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు మొబైల్ కంపెనీలు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ ఏర్పాట్ల విషయంలో ప్రైవేటు కంపెనీలకన్నా.. బిఎస్ ఎన్ ఎల్ ఒక అడుగు ముందే ఉంది.
సంతకం కోసం వెయిటింగ్..
రాష్ట్రపతి సంతకం మినహా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ ఃసంతకంః ముచ్చట తీరిపోతే.. ఇక తమ ఇష్టానుసారంగా రోమింగ్ చార్జీలు వసూలు చేసేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. విభజన బిల్లుపై రాష్ట్రపతి తన తుది ఆమోదం ప్రకటించిన వెంటనే ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణలో ఫోన్ కాల్స్ కు రోమింగ్ వర్తిస్తుందని బిఎస్ ఎన్ ఎల్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మూడు నెలల సమయం పడుతుందని అంచనా. అయితే.. ప్రక్రియకు ఎంతసమయం పట్టినా.. రాష్ట్రపతినుండి ప్రకటన రాగానే రోమింగ్ చార్జీలు వసూలు చేస్తామంటున్నాయి మొబైల్ కంపెనీలు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న బిఎస్ ఎన్ ఎల్ కార్యాలయం.. తెలంగాణ రాష్ట్రంలో తన సేవలు అందించనుంది. ఇక ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) లో కొత్త రాజధాని ఏ నగరంలో ఏర్పాటు చేస్తే అక్కడ బిఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రోమింగ్ అమలులోకి రావడానికి ఏడాది సమయం పట్టింది. కానీ ఇప్పుడు.. రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ ఇచ్చిన వెంటనే రోమింగ్ పేరుతో మొబైల్ కంపెనీలు విరుచుకుపడనున్నాయి. కనుక ఇప్పటినుండే పొదుపుగా మాట్లాడటం అలవాటు చేసుకుందాం. అన్నట్లు ఈ రోమింగ్ అమలులోకి వచ్చినప్పటి నుండీ.. తెలంగాణ నుండి సీమాంధ్రకు వెళ్లినా, సీమాంధ్ర నుండి తెలంగాణకు వచ్చినా.. ఇప్పుడున్న ఫోన్ నెంబర్ల ముందు 0 చేర్చి డయల్ చేయడం మర్చిపోకండి.
No comments:
Post a Comment