MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, September 19, 2013

కంప్యూటర్‌ టీచర్లకు మంగళం!

కంప్యూటర్‌ టీచర్లకు మంగళం!
ప్రజాశక్తి-మనుబోలు Thu, 19 Sep 2013, IST
  • నెలఖారుతో ముగియనున్న ఐసిటి పథకం
  • తొలగింపునకు ఉత్తర్వులు జారీ
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పేద విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను బోధించే టీచర్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటిగ్రేటెడ్‌ కంప్యూటర్‌ ట్రెయినింగ్‌ (ఐసిటి) ఏ5000 పథకం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో వారి స్థానంలో ఆయా పాఠశాలల టీచర్లే కంప్యూటర్‌ విద్య బోధించేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ నుండి ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు (ఆర్సీ నెం.840/విఇ-1/2008) వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పది వేలమందిని ఈ నెల 21న తొలగించనున్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో 2008 సెప్టెంబర్‌ 22న ఇంటిగ్రేటెడ్‌ కంప్యూటర్‌ ట్రెయినింగ్‌ (ఐసిటి) స్కీం 5000- కింద ప్రభుత్వం కంప్యూటర్‌ విద్య ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 18,736 ఉన్నత పాఠశాలల్లో 6,300 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆయా పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య బోధించేందుకు 12,600 మంది కంప్యూటర్‌ టీచర్లను నియమించింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 375 ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిలో 302 ఉన్నత పాఠశాలల్లో 600 మంది కంప్యూ టర్‌ టీచర్లు నియమితులయ్యారు. ఒక్కో పాఠశాలకు ఇద్దరు ఫ్యాకల్టీలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ విద్య నిర్వహణను ప్రభుత్వం నిట్‌ కంపెనీకి అప్పగించింది. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, ప్రింటర్‌, జనరేటర్‌, యుపిఎస్‌ ఇతర ఫర్నీచర్‌ ఏర్పాటు చేశారు. ఆరు నుండి పది తరగతుల వరకు రోజుకు 3 నుండి 4 తరగతులకు బేసిక్స్‌, థీయరీ ప్రాక్టికల్స్‌ను ఫ్యాకల్టీలు చేయించాలి. అందుకుగాను ఒక్కొక్కరికి రూ.2,600 వేతనం నిర్ణయించారు. అందులో పిఎఫ్‌, ఇఎస్‌ఐలకు రూ.300 కటింగ్‌ పోను 2300 చేతికి అందేది. పర్మినెంట్‌ చేస్తారన్న ఉద్దేశంతోనే జీతం తక్కువైనా వారు ఇంతకాలం పనిచేస్తూ వచ్చారు. జిఓ నెం.3 ప్రకారం వారికి రూ.10 వేల వరకూ జీతం ఇవ్వాలి. కంప్యూటర్‌ టీచర్లు తమ వేతనం పెంచాలని, పర్మినెంట్‌ చేయాలని కోరుతూ 2011 సెప్టెంబరు 15 నుండి 105 రోజులు సమ్మె చేశారు. కానీ ప్రభుత్వం జీతం పెంచలేదుగాని ఏడాదికి 15 సిఎల్స్‌ ఇచ్చింది. ఈనెల 21తో ఈ పథకానికి ఐదేళ్లు నిండుతాయి. అందుకు కేటాయించిన నిధులు అయిపోవడంతో దానిని రద్దు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. తొలగించనున్న ఫ్యాకల్టీల స్థానంలో కంప్యూటర్‌ విద్యపై అవగాహన ఉన్న ప్రధానోపాధ్యాయులుగానీ, భౌతికశాస్త్రం, లెక్కలు ఉపాధ్యాయులకుగానీ అప్పగించనుంది. వారి పేర్లను గత నెల 8కి ముందే కమిషనర్‌కు ఈమెయిల్‌ పంపినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో 12,600 మంది కంప్యూటర్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరుకు పదివేలమంది వీధినపడనుండగా ఇంకో 2600 మందికి మరో ఏడాది గడువుంది.
ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి: సుబ్రమణ్యంరెడ్డి
జీతం తక్కువైనా పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతో వెట్టి చాకిరి చేస్తూ వచ్చామనీ, ఇప్పుడు కంప్యూటర్‌ టీచర్లను తొలగించాలనుకోవడం అన్యాయమని రాష్ట్ర కంప్యూటర్‌ టీచర్ల సంఘం కోశాధికారి సుబ్రమణ్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పది వేల మంది కడుపులు కొట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఆందోళన చేస్తాం: కాకు మురళీకృష్ణ యాదవ్‌
పర్మినెంట్‌ చేస్తారనే ఉద్దేశంతో తక్కువ జీతమైనా కంప్యూటర్‌ టీచర్లు విధులు నిర్వహించారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కాకు మురళీకృష్ణయాదవ్‌ అన్నారు. ప్రభుత్వం తమను తొలగించే ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Prajasakti Article Image 

1 comment:

Anonymous said...

కంప్యూటర్ టీచర్స్ ను కంటిన్యూ చెయ్యాలి , రెగ్యులర్ చెయ్యాలి . ఆంధ్రప్రదేశ్ ను కూడా డెవలప్ చెయ్యడానికి సి ఎం చర్యలు తీసుకోవాలి . కేరళ లో రెగ్యులర్ గా చేసారు ఈ విధంగా వారు 100 శాతం అక్షరాస్యత లో విజయం సాధిస్తున్నారు