ప్రభుత్వ శ్రమదోపిడీని వ్యతిరేకించాలి : చుక్కయ్య
ప్రజాశక్తి - బాలసముద్రం Thu, 30 May 2013, IST
మండల సమాఖ్యలో పని చేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వ వైఖరిని ఐక్య ఉద్యమాలతో వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చుక్కయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు ఆవరణలో మండల సమైఖ్య అకౌంటెంట్లు, ఆపరేటర్లు, ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలను చుక్కయ్య సందర్శించి మాట్లాడారు. సిబ్బంది దీక్షలు చేపట్టి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మండల సమాఖ్య సిబ్బంది చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక, ఉద్యోగాలు వదులుకోలేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలనలో కీలకపాత్ర పోషిస్తున్న ఆపరేటర్లు, అకౌంటెంట్లు 24 గంటలూ పనులు చేస్తూ తీవ్ర వేదనకు గురౌతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాఖ్య సిబ్బంది సేవలు కీలకమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండల సమాఖ్య సిబ్బందికి కనీస వేతనం రూ.9300లు చొప్పున చెల్లించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో జిల్లా సమాఖ్య అకౌంటెంట్ల సంఘం అధ్యక్షులు పాల్వాయి పుష్పలత, ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు ఈదునూరి శ్రీనివాస్, మమత, రమేష్, కోటేష్, మాధవి, మల్సూరు, రాజు, సదానందం, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment