MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, March 29, 2014

ఉండాలి ఆప్షన్లు వద్దు

- భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఎపి, టి ఉద్యోగ సంఘాలు   - కమల్‌నాథన్‌ కమిటీకి వేర్వేరుగా వినతి  - అన్ని క్యాడర్లకూ ఆప్షన్లు : ఉపాధ్యాయ సంఘాలు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
ఉద్యోగుల విభజన కసరత్తు ఊపందుకుంది. ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఆప్షన్ల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగులకు ఆప్షన్‌ సౌకర్యం ఉండాలని ఎపి ఉద్యోగ సంఘాలు కోరితే, ఆప్షన్‌ సౌకర్యం ఉండొద్దని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం సచివాలయంలో కమల్‌నాథన్‌, కేంద్ర హోంశాఖ డివోపిటి విభాగం కార్యదర్శి అర్చనా వర్మ, ప్రణాళికా సంఘం ప్రత్యేక కార్యదర్శి టక్కర్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్‌ల సమక్షంలో ఎపి, తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం జరిగింది. సమావేశం నిర్వహణ తీరుపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో విభజనకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలను వివరించాలని కోరడం సమంజసం కాదని తెలిపారు. కమల్‌నాథన్‌ కమిటీ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశామని నాయకులు చెప్పారు. మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. 
ఆప్షన్‌ ఉద్యోగుల హక్కు : అశోక్‌బాబు 
విభజన ప్రక్రియలో ఉద్యోగులకు ఆప్షన్‌ ఇవ్వడం తమ హక్కు అని ఎపిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్‌బాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్ణయించకుండా ఆప్షన్‌ అడగడం సరైంది కాదన్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తే ఊరు కునేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను యథాతథంగా కొనసా గించాలని కోరారు. జిల్లా, జోనల్‌, రాష్ట్ర క్యాడర్‌ ఉద్యో గులందరికీ ఆప్షన్‌ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371-డిని ఎపి పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఉల్లంఘించే ప్రసక్తే లేద న్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 
ఆప్షన్లపై ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలు
ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఆప్షన్ల అంశంపై వివిధ ఉద్యోగ సంఘాల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 
ఆంధ్ర ఉద్యోగులుంటే రణరంగమే : దేవీప్రసాద్‌ 
తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులు పనిచేస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నీ రణరంగంగా మారతాయని టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు జి దేవీప్రసాదరావు హెచ్చరించారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగాలని సూచించారు. 4 నుంచి పదో తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్ని స్థానికతగా గిర్‌గ్లానీ కమిటీ పరిగణించిందని గుర్తు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్‌ సౌకర్యం ఇవ్వకూడదని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో, గిర్‌గ్లానీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. సీమాంధ్రకు పంపాలని స్వచ్చందంగా కోరిన ఆ ప్రాంతానికి చెందిన 1400 మంది ఉద్యోగులను పంపడానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. 20 ఏళ్ల నుంచి జరిగిన నియామకాలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించాలి : నర్సిరెడ్డి, ఐవి 
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ సమస్యలైనా ఉమ్మడి రాష్ట్రంలోనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎ నర్సిరెడ్డి, ఐ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రెండు రాష్ట్రాలకూ నష్టం కలగని రీతిలో సమాన సంఖ్యా ప్రాతిపదికన ఉద్యోగులు కోరుకున్న ప్రాంతంలో పనిచేయుటకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులుగా ఉన్న భార్యభర్తలను ఇద్దరినీ ఒకే రాష్ట్రంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా పోలవరం ముంపునకు గురైన 134 గ్రామాల్లోని టీచర్లకూ ఆప్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
స్థానికత ఆధారంగానే విభజన : శ్రీనివాస్‌గౌడ్‌ 
ఆప్షన్లు, ఇంకో పేరుమీద ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉంటే కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయని టిజివో అధ్యక్షులు వి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆకాశం నుంచి ఉద్యోగాలు ఊడిపడతాయా?అని అన్నారు. తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులు ఎలా పనిచేస్తారని అన్నారు. కమిటీల పేరుతో ఇక్కడ ఉంటే రాబోయే ప్రభుత్వాలు ఉండనిస్తాయా?అని హెచ్చరించారు. బలవంతంగా ఉంటే మళ్లీ ఉద్యమాలు చేపడతామన్నారు.
ఏ ప్రాంతం వారు అక్కడే పనిచేయాలి : విఠల్‌ 
సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఈ ప్రాంతానికి, తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సి విఠల్‌ డిమాండ్‌ చేశారు. 
ఆప్షన్‌ ఇవ్వాల్సిందే : మురళీకృష్ణ 
విభజన సమయంలో ఉద్యోగులకు అప్షన్‌ సౌకర్యం ఇవ్వాల్సిందేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ యు మురళీకృష్ణ కోరారు. సీమాంధ్ర ఉద్యోగుల పిల్లలు తెలంగాణలో పుట్టారని, ఇక్కడే చదువుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు సీమాంధ్రకు వెళ్తే స్థానికేతరులవుతారని తెలిపారు. అక్కడ స్థానికులుగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్‌2వ తేదీలోగా పిఆర్‌సిని ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. 
పొగపెడతాం : నరేందర్‌రావు 
సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేస్తే పొగపెట్టడం ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేందర్‌రావు చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. తల్లిదండ్రుల స్థానికతనూ పరిగణనలోకి తీసుకొని విభజన చేపట్టాలని సూచించారు. 
రాజధానిలో సీమాంధ్ర ఉద్యోగులను కొనసాగించాలి : బొప్పరాజు 
హైదరాబాద్‌లో విభజనకు ముందునుంచే పనిచేస్తున్నందున సీమాంధ్ర ఉద్యోగులను యథాతధంగా కొనసాగించాలని ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. 58:42 నిష్పత్తి ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని సూచించారు. 
సొంత జిల్లాలకు వెళ్లేందుకు అవకాశమివ్వాలి : పిఆర్‌టియు
ఉపాధ్యాయులందరికీ వారి సొంత జిల్లాలకు వెళ్లేందుకు ఆప్షన్‌ సౌకర్యం కల్పించాలని పిఆర్‌టియు అధ్యక్షులు పి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు ఏ జిల్లాకు వెళ్లినా సీనియార్టీని లెక్కించి వారికి లాభం చేయాలని కోరారు. ఉద్యోగులకు రక్షణ సౌకర్యంగా ఉన్న 371-డిని రెండు రాష్ట్రాల్లో వర్తింపచేయాలని ఎపిటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి హృదయరాజు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల విభజన 13:10 నిష్పత్తి ప్రకారం జరపాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, హేక్‌ హుస్సేన్‌ కోరారు. స్థానికత ఆధారంగా లెక్చరర్లను విభజించాలని తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్‌ ఫోరం నేత కిషోర్‌ కుమార, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లను ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. 360 మంది లెక్చరర్లు సీమాంధ్ర వారు తెలంగాణలో, 170 మంది తెలంగాణ లెక్చరర్లు సీమాంధ్రలో పనిచేస్తున్నారని, వారిని సొంత ప్రాంతానికి పంపాలని కోరారు. ఉద్యోగుల పిల్లల స్థానికతను ఎలా నిర్ధారిస్తారని సీమాంధ్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం నేత కెవి కృష్ణయ్య చెప్పారు. ఉద్యోగుల స్థానికతను ఆధారంగా తీసుకుంటే పిల్లలు నష్టపోతారని తెలిపారు. ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలంగాణ గ్రూప్‌-1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్‌ అన్నారు. 

No comments: