MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, January 25, 2014

మహా ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

Posted on: Sat 25 Jan 04:51:26.539982 2014
- కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్షలో బివి రాఘవులు - ఫిబ్రవరి 20న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపు -ప్రజాశక్తి - హైదరాబాద్‌- 
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మహాఐక్యతతో పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లోని ఉద్యోగుల సంఘాలు ఏకమవ్వాలలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత, ఐఆర్‌ సాధనకై శుక్రవారం ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిపార్కు వద్ద ఉదయం 11 గంటల నుండి సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగుల డిమాండ్‌కు మద్దతుగా ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి జె వెంకటేష్‌ నిరాహారదీక్ష చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు పూలమాల వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఒకప్పుడు కొద్ది మంది మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారని, రెండు దశాబ్దాల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయకుండా ప్రభుత్వం దుర్మార్గంగా దోపిడి చేస్తోందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తే డిఎ, వేతనం స్కేలు, పిఆర్‌సి, ఐఆర్‌ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం వీటిని ఎగ్గొట్టే కుట్రపన్నుతోందని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులైతే అణిగిమణిగి ఉంటారని ఇదంతా చేస్తున్నారని తెలిపారు. శాశ్వతంగా పనిచేసే పోస్టుల్లో తాత్కాలిక ఉద్యోగులు ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పు అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి ఆలస్యమవుతుందని ఐఆర్‌ ఇస్తున్నారు, మరి కాంట్రాక్టు ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకోని, ప్రజల సమస్యలు పట్టని రాజకీయ వ్యవస్థను తట్టిలేపేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి మాసాన్ని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ మాసమని ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. 9 నుంచి 20 వరకు కలెక్టరేట్‌, ఎంఆర్‌ఓ, ఆర్‌డిఓ కార్యాలయాల వద్ద కార్యాచరణ ఉంటుందన్నారు. 20న రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మెలో ఉంటారని వెల్లడించారు. సమ్మెను జయప్రదం చేయడానికి అన్ని సంఘాలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 2008లో పెంచిన పిఆర్‌సి ఇప్పటి వరకు 2 లక్షల మంది ఉద్యోగులకు అమలు కాలేదని ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎవి నాగేశ్వర్‌ అన్నారు. పనికి పని చేయాలి, జీతం మాత్రం ఇవ్వరు, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఎప్పటికైనా రెగ్యులర్‌ అవుతామనే ఆశతో ఇనేళ్లుగా పనిచేస్తున్నారని అన్నారు. రెగ్యులర్‌ చేయడానికి 2/94 చట్టం అడ్డం వస్తోందని, చట్టాన్ని సవరించైనా రెగ్యలర్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఐక్యపోరాటం ద్వారానే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.సుధాభాస్కర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వ విధానాలతో సంబంధం ఉందన్నారు. గట్టి మిలిటెంట్‌ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలతోనే కాంట్రాక్టు వ్యవస్థ వచ్చిందని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎంవిఎస్‌ శర్మ తెలిపారు. సరళీకరణ విధానాలు వదులుకుంటే కాంట్రాక్టు వ్యవస్థ పోతుందన్నారు. అన్ని రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వంలో సిఎం పోస్టు, మంత్రివర్గంలో, శాసనసభ, శాసన మండలిలో కూడా కాంట్రాక్టు విధానం లేకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ వి బాలసుబ్రమణ్యం అన్నారు. ఇందులో కూడా ఈ విధానం ఉంటే ఈ రోజు కాంట్రాక్టు ఉద్యోగులతో కలిసి పోరాటం చేసేవారన్నారు. కడుపులు కాలేవారితో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. 13 ఏళ్లను పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయమంటే మాటలు చెబుతూ దాటవేస్తోందని సిపిఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శాసనసభలోని అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో రెగ్యులరైజ్‌ చేయాలని ఒక లేఖ ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. దీక్షకు వచ్చే ముందు రెగ్యులరైజేషన్‌ గురించి ముఖ్యమంత్రికి చెబితే, ఈ సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తాం, రాష్ట్ర విభజన అవుతుందంటున్నారు, తెలంగాణ వచ్చాక చేసుకోండని అన్నారని చెప్పారు. దీక్షకు మద్దతుగా సిపిఐ శాసన సభా పక్ష నాయకులు గుండామల్లెష్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి కళ్లు,చెవులు, తల లేవిని అన్నారు. జీవంలేని జిఓలను ప్రభుత్వం జారీ చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. రెగ్యులర్‌ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు. రెగ్యులర్‌ చేయమంటే కుంటిసాకులు చెబుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే వీరందరిని రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పారు. టిఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ కంచె చేను మేసినట్లు ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. దీక్ష కార్యక్రమానికి ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపాల్‌ అధ్యక్షత వహించారు. దీక్షకు మద్దతుగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు శ్రీనివాసులు, బొడ్డు నాగేశ్వరావు, ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర నాయకులు జనార్ధన్‌రెడ్డి, సిడిసియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి, జె వెంకటేష్‌, ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌.లక్ష్మయ్య, సిఐటియు నాయకులు ధనలక్ష్మి, రమ, కాంట్రాక్టు ఉద్యోగుల నాయకులు అబ్బాస్‌ పాల్గొన్నారు. మధ్యమధ్యలో ప్రజనాట్యమండలి కళాకారులు పాటలు పాడుతూ దీక్షలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. 100 ప్రభుత్వ విభాగాల నుంచి 5000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.



  • No comments: