MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, November 17, 2016

TACT NEWS :: సర్కారు బడిలో.. డిజిటల్ విద్య


-182 పాఠశాలల్లో తరగతులు షురూ.. 
- బంజారాహిల్స్ పాఠశాలలో ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కార్పొరేట్ స్కూళ్లను తలదన్నుతూ.. సర్కారీ స్కూళ్లు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని వాడుకుంటూ డిజిటల్ విద్యాబోధనవైపు అడుగులేశాయి. పాఠ్యపుస్తకాలు, బోధనోపకరణాల అవసరం లేకుండా అర్థవంతమైన బోధనను విద్యార్థులకు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఆకర్షణీయ బోధన పేరిట ఇన్నాళ్లుగా కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన డిజిటల్ క్లాసులు బుధవారం నుంచి ప్రభుత్వ స్కూళ్లలోనూప్రారంభమయ్యాయి.
బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి డిజిటల్ క్లాస్‌రూంతో పాటు మనటీవీ ద్వారా ఆన్‌లైన్ క్లాస్‌రూం, కే-యాన్ ప్రొజెక్టర్ ద్వారా ఆఫ్‌లైన్ క్లాస్‌రూంలను ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ డిజిటల్ విద్యను ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయంగా భావించరాదని, బోధనలో సహాయకారిగా మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. డిజిటల్ తరగతుల వల్ల విద్యాభ్యాసం మరింత సులువవుతుందన్నారు. 2017 విద్యాసంవత్సరం నాటికి వందశాతం డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తామన్నారు. పిల్లలతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ జి.కిషన్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, సర్వశిక్షా అభియాన్ ఏఎస్‌పీడీ భాస్కర్‌రావు, ఆర్జేడీ కృష్ణారావు, ఎస్‌సీఈఆర్‌టీ సలహాదారు ఉపేందర్‌రెడ్డి, ఆర్‌ఎంఎస్‌ఏ జేడీ రమణకుమార్, డీఈవో జి.రమేష్, కార్పొరేటర్ మన్నె కవితాగోవర్ధన్‌రెడ్డి, మాడ్యుల్స్ రైటర్ సువర్ణవినాయక్, గతి కన్సల్టెన్సీ ప్రతినిధి ఎంఎస్‌టీ రావు పాల్గొన్నారు. 

శ్రద్ధగా పాఠం విన్న డిప్యూటీ సీఎం..
డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాఠశాల విద్యార్థిగా మారిపోయారు. విద్యార్థులతో సహా బెంచీపై కూర్చున్న ఆయన జీర్ణకోశం, దంత వ్యవస్థ పాఠ్యాంశాలను శ్రద్ధగా ఆలకించారు. విద్యార్థులతో పాటు బోధనను ఆసక్తిగా గమనించిన ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. బోధన పూర్తైన తర్వాత పాఠాలు ఎంతవరకు అర్థమయ్యాయని విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులందరూ ఫస్ట్‌క్లాస్ మార్కులు సాధించాలని ఉద్బోధించారు. 

182 పాఠశాలల్లోనూ..
జిల్లాలోని 182 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఒకేరోజు 100శాతం డిజిటల్ విద్య అందుబాటులోకి రావడం గమనార్హం. అమీర్‌పేట ధరమ్ కరమ్ రోడ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తిరుమలగిరిలో ఎమ్మెల్యే సాయన్న, ఫిలింనగర్‌లో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సైదాబాద్‌లో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే డా. కె.లక్ష్మణ్, యూసుఫ్‌గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌లు డిజిటల్ తరగతులను ప్రారంభించారు. 

స్కూళ్లో ఆఫ్‌లైన్.. ఇంట్లో ఆన్‌లైన్.. 
పాఠశాలల్లో మనటీవీ ద్వారా ఆన్‌లైన్ చదువులు అందుబాటులోకి రాగా, కే-యాన్ ప్రొజెక్టర్ల ద్వారా ఆఫ్‌లైన్ బోధననందించనున్నారు. ఈ రెండింటిని వినియోగించుకునేలా పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మన టీవీ ప్రసారాల ద్వారా ఆన్‌లైన్‌లో చదువుకునే అవకాశం ఉండగా, కే-యాన్ ప్రొజెక్టర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో చదువుకోవచ్చు. కేబుల్ టీవీ ప్రసారాల లాగే మనటీవీలోనూ తరగతి గది పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నారు. ఈ రెండు సౌకర్యాలు ఒకేరోజు అందుబాటులోకి రావడం గమనార్హం. 

కే-యాన్‌తో బహుళ ప్రయోజనాలు..
కే-యాన్ ప్రొజెక్టర్‌తో బహుళ ప్రయోజనాలున్నాయి. చిన్నపాటి ప్రొజెక్టరే.. చాలా ఎలక్ట్రికల్ డివైస్‌లకు ప్రత్యామ్నాయంగా రూపొందించారు. కే-యాన్‌ను ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్, టీవీ, కంప్యూటర్, ప్రొజెక్టర్, డీవీడీ ప్లేయర్, ఆడియో సిస్టమ్‌లుగా వాడుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్‌ను ఐఐటీ ముంబై సహకారంతో రూపొందించారు. విద్యాబోధనలో ఉన్న లోపాలపై అధ్యయనం చేసిన నిపుణులు ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ ప్రొజెక్టర్‌ను చాలా రాష్ర్టాల్లో వినియోగిస్తున్నారు. దీని విలువ రూ. 1.40 లక్షలు కాగా, తెలంగాణ ప్రభుత్వం కోరికమేరకు కేవలం రూ. 89వేలకే అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు పాఠాలను అప్‌గ్రేడ్ చేయడం, సరికొత్త నూతన అంశాలను పొందుపరచడం దీని ప్రత్యేకత.

బ్లాక్ బోర్డ్ అవసరమే లేదు..
పాఠశాల అంటే నల్లబల్ల ఉండాల్సిందే. నల్లబల్లలేని పాఠశాలలుండవంటే అతిశయోక్తికాదేమో. కానిప్పుడా అవసరం ఉండకపోవచ్చు. కే యాన్ ప్రొజెక్టర్‌లో ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే తెరపై వెట్‌బోర్డ్ డిస్లే అవుతుంది. ఈ వైట్‌బోర్డ్ మీద.. ఏదైనా రాయొచ్చు. తప్పులురాస్తే సరిచేయడం, తప్పుగా పటాలు గీస్తే.. దానికదే సరిచేసుకోవడం ఈ ఒక్క ప్రొజెక్టర్‌తోనే సాధ్యం. ఒకే ఒక్క కేబుల్‌వైర్‌తో ఉన్న ఈ ప్రొజెక్టర్‌ను ఒక గది నుంచి మరో గదికి మార్చుకోవచ్చు. 

తొలిపాఠం బోధించించే అదృష్టం..
డిజిటల్ తరగతుల ప్రారంభించే అవకాశం బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలకు దక్కగా.. తొలిపాఠం బోధించే అదృష్టం ఇద్దరు ఉపాధ్యాయులకు దక్కింది. అదే పాఠశాలలో జీవశాస్త్రం, ఇంగ్లిష్ పాఠాలు బోధిస్తున్న లక్ష్మి, శైలజారెడ్డిలకు దక్కింది. 

మా స్కూళ్లో ప్రారంభమవడం అదృష్టం.. 
డిజిటల్ క్లాసులను మా స్కూల్ నుంచి ప్రారంభించడం మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాం. విద్యాశాఖ అధికారులు మా పాఠశాలకు, పిల్లలకు మంచి అవకాశాన్నిచ్చారు. స్కూళ్లో మనటీవీ క్లాస్‌రూం, డిజిటల్ క్లాస్‌రూం రెండింటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. అవసరాన్ని బట్టి ఇతర తరగతి గదులకు సులభంగా తరలించే వీలున్న ఈ పరికరం టీచర్లకు బోధనను సులభతరం చేస్తుంది.
-పీవీఎల్‌ఎన్ మూర్తి (ఇన్‌చార్జి హెచ్‌ఎం, బంజారాహిల్స్ పాఠశాల)
స్లో లెర్నర్లకు ఉపయోగం.. 
తరగతి గదిలో ప్రతిభావంతులైన విద్యార్థులు ఏ పాఠాన్నైనా సులభంగా అర్థం చేసుకోగలరు. కాని ఇలాంటివారు 5శాతానికి మించి ఉండరు. స్లో లెర్నర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలనుకున్నా కుదరడం లేదు. కానిప్పుడు డిజిటల్ క్లాస్ బోధనలో.. ప్రతిభగల విద్యార్థి ఎంతమేర అర్థం చేసుకోగలగో.. స్లో లెర్నర్లు సైతం అంతేస్థాయిలో అర్థం చేసుకునే వీలుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ స్లో లెర్నర్లకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం. వారి సామర్థ్యాన్ని కొద్దికొద్దిగా పెంచే అవకాశాలుంటాయి. 
-సింహాచలం (స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్)

విన్న పాఠాన్ని మరిచిపోలేం.. 
డిజిటల్‌లో త్రీడీ విజువలైజేషన్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి వింటుంటే ఇట్టే గుర్తుండిపోతుంది. అసలు పాఠం మర్చిపోయే అవకాశమే ఉండదు. మాకు మేమే ప్రశ్నలను తయారుచేసుకుని, టీచర్‌ను డౌట్స్ అడిగేంతలా ప్రిపేరవుతున్నాం. 
-ఎస్.ప్రీతి, విద్యార్థిని

నేను టీచర్‌లా పాఠాలు చెప్పగలను.. 
టీచర్ చెప్పిన తర్వాత పాఠాన్ని నేను టీచర్‌గా బోధించగలనన్న నమ్మకం కుదిరింది. అప్పుడప్పుడు పాఠాలు చెప్పేందుకు ప్రయత్నం చేసేదాన్ని. డిజిటలైజేషన్‌తో నేనిప్పుడు సులభంగా తోటివారికి పాఠాలు చెప్పగలను. -డి.సుప్రియ, విద్యార్థిని
డయాగ్రామ్‌లను స్పష్టంగా చూపిస్తున్నారు.. 
జీవశాస్త్రం, మ్యాథ్స్ డయాగ్రామ్‌లను బోర్డ్‌మీద గీయడానికి చాలా సమయం పట్టేది. డయాగ్రామ్ గీసేవరకే పీరియడ్ బెల్ మోగేది. తెల్లారి మళ్లీ ఇదే పరిస్థితి. కానిప్పుడు ఒక్క క్లిక్ చేస్తే డయాగ్రామ్ బోర్డ్‌మీద వచ్చిపడుతోంది. జూమ్ చేసి విడిభాగాలను స్పష్టంగా చూపిస్తున్నారు. మేం పటాలు గీయాలంటే ఇట్టే గీసేయగలం.
-కె.కమల, విద్యార్థి

బోర్ కొట్టడంలేదు..
డిజిటల్ పాఠాలు వినసొంపుగా ఉన్నాయి. నేత్రానందం కలుగుతోంది. అసలు బోర్ కొట్టడంలేదు. చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అన్నట్లుగా ఉంది. ఇదివరకు 10నిమిషాలైతే చాలు బోర్ అనిపించేంది. ఇప్పుడు పాఠాలను కొత్తగా నేర్చుకునే అవకాశాన్నిచ్చారు. 
-కె. నాగలక్ష్మి, విద్యార్థి
కథలు కథలుగా చెప్పుకుంటం.. 
డిజిటల్ క్లాస్‌లో ఉంటే సినిమా హాల్లో ఉన్నట్లుగా ఉంది. పాఠం స్పష్టంగా వినసొంపుగా ఉంది. సినిమాలు చూసి తెల్లారి కథల కథలుగా చెప్పుకున్నట్లుగా ఇప్పుడే పాఠాలను చెప్పుకునే అవకాశం ఉంది. ఇలా ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటుంటే పాఠం కలకాలం గుర్త్తుండిపోతుంది. 
-ఎన్. సాయికుమార్, విద్యార్థి

మీ స్కూల్‌కే వస్తామంటున్నారు..
మీ స్కూళ్లో డిజిటల్ క్లాసులు చెప్తారంట కదా అని మా చుట్టుపక్కలోళ్లు అడుగుతున్నారు. మేం కూడా మీ స్కూల్‌కే వస్తామంటున్నారు. డిజిటల్ తరగతులతో మా స్కూళ్లో విద్యార్థుల సంఖ్య పెరగబోతుంది. ప్రైవేట్‌లో చదువుకోలేనివాళ్లు మా స్కూళ్లోనే అడ్మిషన్ తీసుకుంటామంటున్నారు. 
-భవాని, విద్యార్థి

No comments: