హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్భాటంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మిథ్యగా మారుతోంది. కంప్యూటర్ల మంజూరు, సిబ్బంధి కేటాయింపు చకచకా చేసినా అది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అగమ్య గోచరంగా తయారయింది. ఏయే కారణాలు దీన్ని ప్రభావితంచేస్తున్నాయో చూద్దాం..
2008లో కంప్యూటర్ల మంజూరు..
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 2008 లో కంప్యూటర్లు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్ల చొప్పున పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది. ప్రత్యేక గదులు మౌలికసదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు కంప్యూటర్లు బూజుపడుతున్నాయి. ప్రకాశం జిల్లాల్లో 30 పాఠశాలల్లో 100కు పైగా కంప్యూటర్లు మాయమయ్యాయి. వరసగా పాఠశాలల్లో కంప్యూటర్లు పోయినా.. ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు.
కంప్యూటర్ గదులకు తాళాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లను తీసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్ల లేకుండా పోయారు. దీంతో కొద్ది రోజులుగా చాలా పాఠశాలల్లో కంప్యూటర్ గదులకు తాళాలు పడ్డాయి. పాఠాలు చెప్పే టీచర్లు లేకపోవడంతో విద్యార్ధులకు నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆర్భాటంగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టి.. ఇప్పుడు కంప్యూటర్ బోధకులను తొలగించడంపై విద్యా సంఘాలు తప్పుపడుతున్నాయి. పోటీ ప్రపంచంలో తప్పనిసరిగా మారిన కంప్యూటర్ విద్యను పాఠశాల స్థాయిలోనే అందిస్తామని ప్రభుత్వం ఓవైపు గొప్పగా ప్రచారం చేస్తూనే భారం పేరుతో సిబ్బందిని తొలగించింది. అయితే పాఠశాలలోని ఏదో ఒక ఉపాధ్యాయుడికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి విద్యార్ధులకు విధ్యను బోధించాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు ఇది వీలుకాదని, సిలబస్ ను పూర్తిచేయడానికే సమయం చాలడం లేదని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి.
చిత్తశుద్ధితో వ్యవహరించాలి..
చిన్ననాటి నుంచే కంప్యూటర్ విధ్యను అందించి ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ధీటుగా సర్కారీ విద్యార్ధులను తయారుచేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఆచరణలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి సర్కార్ బడుల్లో కంప్యూటర్ విధ్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
No comments:
Post a Comment