కర్నూలు(రాజ్‌విహార్): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సాంకేతిక విద్య అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లను తొలగించడం తగదని శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఎం. గేయానంద్ అన్నారు. బుధవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని కార్మిక, కర్షక భవన్‌లో కంప్యూటర్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరమా.. లేదా?’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం, కంప్యూటర్ విద్య ఉన్న పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరుతున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. ఈ వలసలు నివారించేందుకు ప్రభుత్వాలు ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.
కంప్యూటర్ టీచర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సింగ్, నాగరాజు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కంప్యూటర్ టీచర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment