MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, May 6, 2014

ప్రత్యామ్నాయ విధానాలతోనే కార్మిక హక్కుల రక్షణ

ప్రత్యామ్నాయ విధానాలతోనే కార్మిక హక్కుల రక్షణ

Posted on: Tue 29 Apr 23:54:15.311826 2014


కార్మికుల జీవితాలు మెరుగుపడాలంటే కార్పొరేట్‌ శక్తులకు, సంపన్నులకు నేడు అనుకూలంగా ఉన్న నయా ఉదారవాద విధానాలు మారాలి. ఈ విధానాలు మారకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా కార్మికులకు న్యాయం జరగదు. ఏ పేరుతో పిలిచినా ఈ విధానాలను, ఈ విధానాల వెనుక ఉన్న రాజకీయాలను నిస్పష్టంగా తిరస్కరించాలి. నేడు ఈ వినాశకర విధానాలను వేగంగా అమలుచేసే కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపిలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే కార్మికుల జీవితాలు మరింత దుర్భరమవుతాయి. కార్మికవర్గం 10 డిమాండ్ల సాధనకై చేస్తున్న పోరాట ఫలాలు సాధించుకోవాలంటే ఈ పార్టీలను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఏర్పడే ప్రభుత్వాలలో ఈ మూడు పార్టీల పాత్ర ఏమీ లేకుండా చూడడం నేడు కార్మికవర్గానికి అత్యంత ఆవశ్యం. కార్మిక వర్గానికి అండదండలిస్తున్న వామపక్షాల సహకారంతో ఏర్పడే ప్రభుత్వాల వల్ల మాత్రమే నేటి పరిస్థితుల్లో కార్మికవర్గానికి శుభంకలుగుతుంది. 

          ఈ సంవత్సరం మేడేకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే గత సంవత్సరం అంతా దేశవ్యాప్తంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి కంకణబద్ధులవుతున్న సమయం ఒకప్రక్క, మరోప్రక్క పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేడే జరుగుతోంది. నూతనంగా కొలువుతీరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన భవితను నిర్ణయించబోతున్నాయి. కార్మికవర్గం జీవనప్రమాణాలు బాగుపడే దిశలో ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడం చారిత్రక అవసరం.

గత సంవత్సరం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిరంతరం పోరాటాలు జరిగాయి. లక్షల సంఖ్యలో కార్మికులు అటు సంఘటితరంగంలోనూ, ఇటు అసంఘటితరంగంలోనూ, ప్రైవేట్‌, ప్రభుత్వ రంగాలలోనూ, ఇన్సూరెన్సు, బ్యాంకులు, టెలికం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్కీమ్‌ కార్మికులు దీర్ఘకాల పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాలన్నింటిలోనూ యాజమాన్యాలకు సేవచేసేలా ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలను ప్రయోగించింది. కార్మిక నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసుల్లో ఇరికించి, హత్యానేరాలు మోపి జైళ్లలో నిర్బంధించింది. మారుతి సుజుకీ మనేసర్‌ ప్లాంట్‌ నాయకులింకా జైళ్లలో మగ్గుతున్నారు. ఇన్ని నిర్బంధాలున్నా కార్మికవర్గ ఐక్యత గత నాలుగు సంవత్సరాలుగా పెద్దఎత్తున పెరగడం గమనార్హం. ప్రపంచ చరిత్రలోనే చరిత్రాత్మకంగా 10 కోట్ల మందికి పైగా కార్మికులు విశాల ఐక్యతతో గత సంవత్సరం రెండు రోజులు సమ్మె చేశారు. ఈ సమ్మె రెండు సవాళ్ళను ముందుకు తెచ్చింది. అదేమంటే ఒకటి మన సమస్యలపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? రెండవది కార్మికవర్గ ఐక్యతను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి?
ధరలు తగ్గించాలనేది కార్మికుల ప్రధాన డిమాండ్‌ కాగా ఆ ధరలను మరింత పెంచే దిశగా ప్రభుత్వ విధానం ఉంది. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణ కొనసాగుతూనే ఉంది. అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ చర్యలు అటుంచి ఉద్యోగ భద్రతకే ప్రమాదం ఏర్పడుతోంది. కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు ఉండాలనే సహేతుకమైన కోర్కెను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోప్రక్క కార్మికుల పొదుపు సొమ్మును కూడా కాజేయడానికి ప్రభుత్వం పెన్షన్‌ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కార్మికవర్గ ఐక్యతను మరింత పటిష్టంగా ముందుకు తీసుకుపోవడం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యం. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కేంద్రలోనూ, రాష్ట్రంలోనూ 10 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. నిరుద్యోగం పెరుగుతోంది. 2012-13లో డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా ఉపాధిరహిత అభివృద్ధేనని తేటతెల్ల మవుతోంది. మరోప్రక్క కులం, ప్రాంతాల పేరుతో ప్రజలు వివక్షతకు గురవుతున్నారు. ప్రభుత్వశాఖల్లో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి పోస్టులను నింపడం లేదు. గిరిజనుల నుంచి భూములు లాక్కొని బడా కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతున్నారు. మహిళలపై అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం వచ్చినా అత్యాచారాలు కొనసాగడం మనం గమనించవచ్చు. మహిళను ఒక సరుకుగా మార్చి వ్యాపారమయం చేయడం వల్లనే చట్టాలున్నా అత్యాచారాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానాల వల్లే ప్రజలు కడగండ్లపాలవుతున్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులు కొల్లగొట్టుకుపోయేలా అనుమతించడం నయా ఉదారవాద విధానాల సారాంశం. ఈ విధానాల వల్ల సంపన్నులు మరింత సంపన్నులై, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు. విద్య, వైద్యం, గృహవసతులు వంటివి సామాన్య ప్రజానీకానికి అందనంత దూరంలో ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా కాకుండా కార్పొరేట్‌ శక్తుల లాభాలను మరింత పెంచే దిశగా రూపాంతరం చెందుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదను అవినీతి పద్ధతుల్లో జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ శక్తులు కొల్లగొట్టుకుపోతున్నాయి. ఈ విధానాలకు అడ్డుకట్ట వేయడం ద్వారానే దేశ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను కాపాడగలం. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు, అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను మనం పరిశీలించాలి.
          తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని కార్మికవర్గం పోరాటాలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాకంటక పాలనతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభాసుపాలైంది. ఆ పార్టీని ఓడించడానికి ఇప్పటికే ప్రజలు సమాయత్తమయ్యారు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మతోన్మాద బిజెపి పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. కార్పొరేట్‌ శక్తుల నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల ధనాన్ని వెదజల్లి ప్రజలను భ్రమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. గుజరాత్‌ అభివృద్ధి నమూనాతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపి రెండు లక్ష్యాలను ఏక కాలంలో నెరవేర్చాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ రెండూ ఒకదానికొకటి అంతస్సంబంధం కలిగి ఉన్నాయి. ఒకటి నయా ఉదారవాద విధానాల కొనసాగింపు, రెండవది కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నచేయడం. కార్మికవర్గ ఐక్యత ద్వారానే నయాఉదారవాద విధానాలను ఓడించడం సాధ్యం. ఆ విధానాలను మరింత వేగంగా అమలు చేయడమే బిజెపి సంకల్పం. ఆ విధానాలను నిరాఘాటంగా అమలు చేయాలంటే కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం దానికి అవసరం. మతం పేరుతో ప్రజల మధ్య అనైక్యతను సృష్టించడం, తద్వారా తన అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి అనుకూల విధానాలను ముందుకు తీసుకుపోవడం బిజెపి లక్ష్యం. దీనికనుగుణంగానే ఈ ఎన్నికల ప్రణాళికలో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని, ఉమ్మడి సివిల్‌ కోడ్‌ అమలు చేస్తామని, కాశ్మీర్‌కున్న ప్రత్యేక హోదా రద్దుచేస్తామనే వంటి అంశాలు పేర్కొన్నారు. ఇవన్నీ కార్మికవర్గం త్యాగాల ఫలితంగా ఏర్పరచుకున్న ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికే. మరోప్రక్క ధరల పెరుగుదల, ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో కాంగ్రెస్‌ కంటే మరింత వేగంగా పోవడం బిజెపి ప్రత్యేకత. 1999-2004 మధ్యలో వాజ్‌పారు నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ పరిశ్రమలను సర్వనాశనం చేసింది. పెట్రోల్‌, గ్యాస్‌ వంటి ఉత్పత్తులపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేసి ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది. కార్మికుల పొదుపు సొమ్ము అయిన పిఎఫ్‌ను షేర్‌ మార్కెట్‌లో పెట్టి అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడిదారుల లాభాలను పెంచడానికి పెన్షన్‌ ఫండ్‌ అధారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ)ని 2003లో ఏర్పరిచింది. బిజెపి కార్పొరేట్‌ సేవ ఎంత నగంగా ఉందంటే పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు పార్లమెంటులో చట్టం కాకముందే 2004 జనవరి 1 నుంచి అత్యంత అప్రజాస్వామికంగా అమలు చేసింది. 2014లో కాని ఇది చట్టరూపం దాల్చకపోయినా 10 సంవత్సరాల పాటు పార్లమెంటు ఆమోదం లేకుండా అమలు చేసినతీరు దీని నిరంకుశత్వానికి నిదర్శనం. ఇదీ బిజెపి నిర్వాకం. తాము నిత్యం విమర్శించే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపి 2014లో దానికి చట్ట రూపం తీసుకురావడానికి బిజెపి సహకరించింది. మన రాష్ట్రంలో నేడు మరో పచ్చి కార్మిక వ్యతిరేకి తెలుగుదేశంతో జతకట్టి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతోంది.
కార్మికులకు సంఘాలు ఉండకూడదని, సమ్మెలు చేయకూడదని కరాఖండిగా చెప్పిన చరిత్ర తెలుగుదేశం నాయకునిది. కార్మికులు సమ్మెచేస్తే సంస్థలకు వచ్చే నష్టాలను కార్మికుల జీతాల నుంచి రికవరీ చేస్తామని కొత్త సూత్రీకరణకు ఈయన శ్రీకారం చుట్టాడు. కార్మిక హక్కులకు కనీస గౌరవం కూడా ఇవ్వనిరాకరించాడు. కార్మికచట్టాలు అమలు పర్యవేక్షించే లేబర్‌ అధికారుల తనిఖీలపై ఆంక్షలు విధించి కార్మికశాఖను యాజమాన్య శాఖగా మార్చివేశాడు. కాంట్రాక్ట్‌ కార్మిక చట్టంలో సెక్షన్‌ 10ని సవరించి కాంట్రాక్టీకరణను చట్టబద్ధం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటిలోనూ కాంట్రాక్టీకరణ చేసిన కీర్తి ఈ మహానుభావునిదే. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్‌కు నోచుకోకుండా, కనీస చట్టపర హక్కులు కూడా లేకుండా నేడు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా ఉద్యోగులు నానా అవస్థలు పడుతుండటానికి కారణం ఈయన ప్రారంభించిన విధానాలే. 65 శాతం పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయాన్ని దండుగగా సూచించి రైతుల ఆత్మహత్యలకు గురిచేసిన ప్రబుద్ధుడు. విద్యుత్‌ సంస్థను మూడు ముక్కలు చేసి, ముగ్గురు ప్రాణాలను బలిగొని, రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి కారణభూతుడీయన. ఆయన మళ్ళీవస్తే కార్మికులకున్న ఈ హక్కులు కూడా ఉండవు. పర్మినెంట్‌ ఉపాధి పూర్తిగాపోయి కాంట్రాక్ట్‌ వ్యవస్థ సార్వజనీన మవుతుంది. సంఘాలు, సమ్మెలు అణచివేతకు గురవుతాయి. మరలా ఆయన పాలన తెచ్చుకోవడమంటే పెనంలోంచి పొయ్యిలో పడినట్లే.
          ప్రభుత్వరంగ పరిశ్రమల్లో వాటాల విక్రయానికి ఒక మంత్రిత్వశాఖనే ఏర్పరిచిన ఘనచరిత్ర గలిగిన బిజెపితో ఈ పచ్చి కార్మికవ్యతిరేకి అయిన టిడిపి దోస్తీ కట్టడం నేడు రాష్ట్రానికి, దేశానికి అత్యంత ప్రమాదకరమైన ఘటన. మన రాష్ట్రంలో వీరిద్దరి సహకారంతోనే 1999-2004 మధ్య కాలంలో లక్షల కోట్ల విలువచేసే కెజి బేసిన్‌ను అంబానీల పరమైంది. అత్యంత విలువైన ఖనిజ సంపద కలిగిన హిందూస్థాన్‌ జింక్‌ను వేదాంత బహుళజాతి కంపెనీకి కట్టబెట్టారు. నేడు కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న గంగవరం పోర్టు ప్రైవేట్‌ సంస్థకు ఇచ్చింది వీరే. రాష్ట్రంలోని బిహెచ్‌పివి, బిహెచ్‌ఇఎల్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వరంగ పరిశ్రమలను నిర్వీర్యం చేయడానికి కుట్రపన్నింది వీరి మిత్రబంధమే. అలాంటి మిత్రద్వయాన్ని రానిస్తే రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిట్లో ఇరుక్కున్నట్లే.
          కాంగ్రెస్‌, బిజెపి, తెలుగుదేశం పార్టీలు అవలంబిస్తున్న నయాఉదారవాద విధానాలకు భిన్నంగా వామపక్షాలు ప్రత్యామ్నాయ విధానాలను ప్రచారంలో పెట్టాయి. పార్లమెంటు, అసెంబ్లీ లోపల, బయట నయాఉదారవాద విధానాలను వ్యతిరేకించడంలో నికరంగా నిలిచాయి. కార్మిక హక్కులను కాపాడ్డంలో సర్వశక్తులు వడ్డుతున్నాయి. యుపిఎ-1 ప్రభుత్వ కాలంలో వామపక్షాలు పార్లమెంటులో బలంగా ఉండటంతో ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టాలు చేయించగలిగాయి. ప్రభుత్వరంగ సంస్థల వాటాల అమ్మకం, పెన్షన్‌ సంస్కరణలు, బ్యాంకు, ఇన్సూరెన్సు వంటి రంగాల ప్రైవేటీకరణ, వివిధ రంగాల్లో ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి వంటి జాతి వ్యతిరేక విధానాలను నివారించగలిగాయి. కార్మికవర్గ పోరాటాలకు అన్ని సందర్భాలలో అండగా నిలిచాయి. వామపక్షాలు బలంగా ఉంటేనే కార్మికవర్గానికి రక్షణ అన్నది సుస్పష్టం.
          కార్మికుల జీవితాలు మెరుగుపడాలంటే కార్పొరేట్‌ శక్తులకు, సంపన్నులకు నేడు అనుకూలంగా ఉన్న నయా ఉదారవాద విధానాలు మారాలి. ఈ విధానాలు మారకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా కార్మికులకు న్యాయం జరగదు. ఏ పేరుతో పిలిచినా ఈ విధానాలను, ఈ విధానాల వెనుక ఉన్న రాజకీయాలను నిస్పష్టంగా తిరస్కరించాలి. నేడు ఈ వినాశకర విధానాలను వేగంగా అమలుచేసే కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపిలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే కార్మికుల జీవితాలు మరింత దుర్భరమవుతాయి. కార్మికవర్గం 10 డిమాండ్ల సాధనకై చేస్తున్న పోరాట ఫలాలు సాధించుకోవాలంటే ఈ పార్టీలను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఏర్పడే ప్రభుత్వాలలో ఈ మూడు పార్టీల పాత్ర ఏమీ లేకుండా చూడడం నేడు కార్మికవర్గానికి అత్యంత ఆవశ్యం. కార్మిక వర్గానికి అండదండలిస్తున్న వామపక్షాల సహకారంతో ఏర్పడే ప్రభుత్వాల వల్ల మాత్రమే నేటి పరిస్థితుల్లో కార్మికవర్గానికి శుభంకలుగుతుంది. అటువంటి ప్రభుత్వాలను ఏర్పరచడానికి సహకరించేలా కార్మికవర్గం ఈ ఎన్నికల్లో వ్యవహరించాలి. సానుకూల ప్రభుత్వాలు, సమైక్య పోరాటాల ద్వారానే హక్కుల రక్షణ సాధ్యం.
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు) 
- ఎ అజరుశర్మ

No comments: