కార్మిక కమిషనర్‌తో చర్చలు సఫలం -ఇయు, టిఎంయు వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఈయూ, టిఎంయూ కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు పెంచిన 27 శాతం మధ్యంతర భృతిని ఏప్రిల్ 15 నాటికి చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకారం తెలిపింది. దీంతో బుధవారం ఉదయం నుంచి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను ఉపసంహ రించుకుంటున్నట్లు ఇయూ, టిఎంయూ ప్రకటించాయి. అంతకుముందు చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగింది. దానితో నేటి ఉదయం నుంచి సమ్మె చేస్తామని ఇయు, టిఎంయు ప్రధాన కార్యదర్శులు కె పద్మాకర్, ఇ అశ్వద్దామరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐఆర్ చెల్లించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రానందునే 27 శాతం ఐఆర్ చెల్లించలేక పోతున్నామని అధికారులు తెలియజేయడం సమంజసం కాదని తెలిపారు. జనవరి 26న కుదిరిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి నుంచి చెల్లించాల్సిన ఐఆర్ ఇవ్వకుండా ఆర్టీసి ఉద్యోగులపై సవతితల్లి ప్రేమను కనబరుస్తోందని పేర్కొన్నారు. అధికారుల ఈ వైఖరిని నిరసిస్తూనే బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటు న్నామని తెలిపారు. ఆర్టీసి ఉద్యోగులకు వెంటనే 27 శాతం ఐఆర్ చెల్లించాలని కోరారు. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ఇయు, టిఎంయు ఆధ్వర్యంలో రెండోరోజు నిర్వహిస్తున్న నిరాహారదీక్షా శిబిరాన్ని పద్మాకర్, అశ్వథ్థామరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇయు ఉప ప్రధాన కార్యదర్శి పి దామోదర్‌రావు, టిఎంయు నాయకులు యాదయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ కోశాధికారి ఎవి రావు, ఎఐటియుసి నాయకులు విఎస్ బోస్, యూసుఫ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment