16న టెట్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపిటెట్) రాతపరీక్ష నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈనెల 16వ తేదీన టెట్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ (ఇసి) పచ్చజెండా ఊపింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు. ఇసి అనుమతితో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 4.49 లక్షల మంది అభ్యర్థులు హాజరవు తున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష కాకపోవడంతో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ నిర్వహించవచ్చని విద్యాశాఖ భావించింది. మరోవైపు పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతిని, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిసి టెట్ నిర్వహించాలని విన్నవించారు. సిఎస్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జి వాణీ మోహన్ మంగళవారం టెట్ నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఎం జగదీశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన రోజే ఈనెల 16న టెట్ నిర్వహణకు సంబంధించిన అనుమతి ఇసి నుంచి లభించింది.
ఏప్రిల్ 4న ఫలితాలు విడుదల చేస్తామని జగదీశ్వర్ తెలిపారు.
టెట్ నిర్వహణ కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1975 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తీసుకున్న హాల్‌టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయా? లేక కొత్త హాల్‌టిక్కెట్లు జారీచేస్తారా? అన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
No comments:
Post a Comment