ప్రజాశక్తి-హైదరాబాద్ ప్రతినిధి
మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం విడనాడకపోతే ఫిబ్రవరి 8 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియస్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జిహెచ్‌ఎంసి సెంట్రల్ జోన్ కార్యాలయం ఖైరతాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్లతో ఒప్పంద గడువు ముగిసి 2 నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. దీన్నిబట్టి మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోందన్నారు. కనీస వేతనం రూ.12500 నిర్ణయించాలని, వేతన పెంపుదల పి.ఆర్.సి అమలయ్యేనాటి నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ నగర అధ్యక్షులు జె.వెంకటేశ్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్మికుల సమస్యలపై 2013 అక్టోబర్ 21 నుండి 24 వరకు రాష్ట్ర వ్యాపిత సమ్మె సందర్భంగా నవంబర్ 05, 2013న జిఓ నెం.1615 కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిదని తెలిపారు. కమిటీ ఏర్పడిన 30 రోజుల్లో డ్రాప్ట్ నివేదికపై యూనియన్ల ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్పినా నేటికీ ప్రభుత్వం స్పందించకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా గతంలో చేసుకున్న ఒప్పందాలను ఫిబ్రవరి 7 నాటికి అమలు చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు కృష్ణారావు, ఏసురత్నం, బిఎంఎస్ నాయకులు శంకర్, హెచ్‌ఎంఎస్ నాయకులు రెబ్బరామారావు తదితరులు మాట్లాడారు.
No comments:
Post a Comment