హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా ఐసిటి పథకం కింద ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య ఈరోజుతో ముగియనుంది. దీంతో 5 వేల ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ విద్య ప్రశ్నార్ధకంగా మారనుంది. దాదాపు పది వేల మంది కంప్యూటర్ టీచర్లు ఉపాధి కోల్పోనున్నారు. వేలాది విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిటి పథకం కింద 2008 సంవత్సరం నుంచి కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు. 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ఈ పథకం ఇవాళ్టితో ముగుస్తోంది. ఈ అయిదేళ్లలో ఐసిటి పథకం కింద దాదాపు 500 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేశారు. ఇప్పటిదాకా 75 శాతం నిధులను కేంద్రమే సమకూర్చింది. ఇవాళ్టితో కేంద్రం ఇచ్చే నిధులకు కాలపరిమితి ముగిసింది. ఈ పథకం కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి మంగళంపాడుతోంది. ఈ స్కూళ్లలోని పది వేల మంది కాంట్రాక్టు కంప్యూటర్ టీచర్ల సర్వీసును నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఇంతమంది కంప్యూటర్ టీచర్లు ఒక్కసారిగా ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు వేలాది పేద విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇంతకాలమూ వీటిమీద పెట్టిన ఖర్చు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. స్కూల్స్ లోని కంప్యూటర్ ల్యాబ్‌లను వృథాగా మూలన పడేయాల్సిన దుస్థితి దాపురించింది. కేవలం పాతిక ముప్పై కోట్లు కేటాయిస్తే కంప్యూటర్ విద్యను కొనసాగించవచ్చని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పదివేల మంది టీచర్లు వీధినపడకుండా వుంటారు. మరోవైపు పేద విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం అందిపుచ్చుకోగలుగుతారు.
No comments:
Post a Comment